Kathiresan Passes Away:  హీరో ధనుష్‌ నా కొడుకే అంటూ కోర్టు మెట్లు ఎక్కిన కదిరేశన్‌ తాజాగా కన్నుమూశారు.  10 ఏళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్ తమ కొడుకేనంటూ కదిరేశన్, మీనాక్షి అనే దంపతులు కోర్టులో కేసు వేసి దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. సుమారు 10 ఏళ్ల పాటు న్యాయస్థానంలో పోరాటం చేశారు. అయితే, చివరకు కోర్టు ధనుష్ వారి కొడుకు అనేందుకు సరైన ఆధారాలు లేవంటూ గత నెల(మార్చి) 14న తుది తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుతో తీవ్ర ఆవేదనకు గురైన కదిరేశన్ మంచాన పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన భార్య మీనాక్షి, కదిరేశన్ ను  మధురై రాజాజీ హాస్పిటల్ లో చేర్పించారు. తాజాగా ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.


ఇంతకీ కదిరేశన్ కేసు ఏంటంటే?


మేలూర్‌ కు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు, నటుడు ధనుష్‌ తమ కొడుకు అంటూ 2015లో మేలూర్‌ కోర్టులో కేసు వేశారు. స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే ధనుష్‌ ఇంట్లో నుంచి పారిపోయాడని కోర్టుకు తెలిపారు. అతడు తమ కొడుకే అని చెప్పేందుకు ఆధారాలుగా బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీ, 2002లో జాబ్ కోసం ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్ లో ధనుష్ ఎంట్రీ చేయించుకున్న సర్టిఫికేట్ ను కోర్టుకు అందించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. కదిరేశన్ దంపతులు సమర్పించిన ఆధారాలతో ధనుష్ వారి కొడుకే అని చెప్పలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.


డబ్బు కోసమే కేసు వేశారన్న ధనుష్ న్యాయవాదులు


కేసు విచారణ సందర్భంగా కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకేనని చేస్తున్న వాదనలో నిజం లేదని ధనుష్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదించారు. కదిరేశన్‌ కోర్టుకు ఇచ్చిన టీసీలో ఉన్న పుట్టుచ్చలు, ధనుష్ కు లేవని చెప్పారు. కోర్టు వారు పరిశీలించి తను నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ధనుష్‌ తమ కొడుకే అని చెప్పడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు రూ. 65 వేలు ఇప్పించాల్సిందిగా కోర్టును కదిరేశన్‌ దంపతులు కోరారని, కేవలం డబ్బు కోసమే వాళ్లు ఈ కేసును వేశారని ధనుష్ తరఫు న్యాయవాదులు వాదించారు.  


కేసు కొట్టివేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన కదిరేశన్


కదిరేశన్ దంపతులు సమర్పించిన టీసీలో ఉన్న పుట్టుమచ్చలపైన కోర్టులో కీలక విచారణ జరిగింది. కోర్టు రిజిస్టార్‌ ఆధ్వర్యంలోనే మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టు మచ్చలను పరిశీలించారు. కదిరేశన్ దంపతులు చెప్పినట్టుగా ధనుష్‌ కు పుట్టుమచ్చలు లేవని తేల్చారు. దీంతో న్యాయస్థానం కదిరేశన్ పిటిషన్‌ను కొట్టివేసింది. సుమారు 10 ఏండ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు ధనుష్.. కదిరేశన్, మీనాక్షి దంపతుల కొడుకు కాదని తేల్చింది. కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకే ధనుష్‌ జన్మించినట్లు కీలక తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు తర్వాత కదిరేశన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అదే బాధలో మంచానికి పరిమితమై చివరకు చనిపోయారు.


Read Also: రాఘవ లారెన్స్ తో లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా?