కన్నడ సినిమా 'కాంతార' (Kantara Movie) కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆయన జాక్ పాట్ మిస్ అయ్యారని, కోట్లకు కోట్లు లాభాలు వచ్చే అవకాశాన్ని కోల్పోయారని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. అసలు వివారాల్లోకి వెళితే...
 
'కాంతార' కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలైంది. గీతా ఆర్ట్స్ సంస్థలో కీలక వ్యక్తి, నిర్మాత 'బన్నీ' వాసు ఆ సినిమా చూశారు. తెలుగులో విడుదల చేస్తే బావుంటుందని ఆయన భావించారు. అల్లు అరవింద్‌కు విషయం చెప్పి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునేలా చేశారు. తెలుగులో సినిమాను విడుదల చేయడానికి అంగీకరించారు గానీ... రైట్స్ మొత్తం కొనలేదట! సినిమాను కమీషన్ పద్ధతి మీద విడుదల చేసేలా మాట్లాడుకున్నారట. 


ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ మొత్తం గీతా ఆర్ట్స్‌కు రావడం లేదు. అందులో కొంత మాత్రమే వస్తున్నాయి. మిగతావి కన్నడ నిర్మాతకు వెళుతున్నాయి. హోల్ సేల్ తెలుగు వెర్షన్ రైట్స్ తీసుకుని ఉంటే బావుండేదని గీతా ఆర్ట్స్ జనాలు ఫీల్ అవుతున్నట్లు గుసగుస. అదీ సంగతి! 'కాంతార' తెలుగు హక్కులను అల్లు అరవింద్ మూడు కోట్లకు కొన్నారని, ఆయనకు భారీ లాభాలు వస్తున్నాయని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదట. 


'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) ఈ 'కాంతార' చిత్రాన్ని నిర్మించారు. మరోసారి ఆయన పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్నారు. 'కాంతార'లో కథానాయకుడిగా నటించిన రిషబ్ శెట్టి, సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన నటనకు, దర్శకత్వానికి తెలుగులో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. 


Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?






Kantara Telugu Version Collection : తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార' చిత్రానికి తొలి రోజు ఐదు కోట్ల రూపాయల గ్రాస్ లభించింది. రెండో రోజు ఈ సినిమాకు ఆరున్నర కోట్ల రూపాయల గ్రాస్ లభించింది. దాంతో రెండు రోజుల్లో రూ. 11.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సాధారణంగా సోమవారం వసూళ్ల దూకుడు తగ్గుతుంది. కానీ, మండే 'కాంతార'కు ఐదు కోట్ల గ్రాస్ లభించింది. మూడు రోజుల్లో మొత్తం మీద 16.5 కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా.






Kantara Hindi Box Office : తెలుగుతో పాటు హిందీలోనూ 'కాంతార'కు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిలో సినిమా శుక్రవారమే విడుదల అయ్యింది. అక్కడ మొదటి రోజు రూ. 1.27 కోట్లు, శనివారం రూ. 2.75 కోట్లు, ఆదివారం రూ. 3.50 కోట్లు, సోమవారం రూ.1.75 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.






Kantara Sequel Update : 'కాంతార' సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్వయంగా రిషబ్ శెట్టి చెప్పారు. అయితే... మరో సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని ఉందని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉందని ఆయన పేర్కొన్నారు. అదీ సంగతి!