కన్నడ ఫిల్మ్ మేకర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార' (Kantara Movie). తొలుత కన్నడలో విడుదల అయ్యింది. ఆ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. థియేటర్లలో ఈ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ మీదకు వస్తోంది. 


నవంబర్ 24 నుంచి...
Kantara On Amazon Prime : 'కాంతార' స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఈ రోజు అనౌన్స్ చేశారు. దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళంతో పాటు హిందీలో కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
 
'వరాహ రూపం' ఉంటుందా?
'కాంతార' సినిమాలో 'వరాహ రూపం' పాట తాము స్వరపరిచిన 'నవసర...' పాటకు కాపీ అని కేరళకు చెందిన 'తైక్కుడం బ్రిడ్జ్' ఆరోపించింది, కేరళలోని కోర్టులో కేసు వేసింది. వాళ్ళకు అనుకూలంగా తీర్పు రావడంతో యూట్యూబ్, ఇతర ఓటీటీ వేదికల నుంచి పాటను తొలగించారు. మరి, ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలో ఉంటుందో? లేదో? చూడాలి. 'కాంతార' పతాక సన్నివేశాల్లో ఆ పాట కీలక పాత్ర పోషించింది. 


విమర్శలు పక్కన పెడితే... 'కాంతార'కు దేశంలో ఎక్కువ శాతం మంది నుంచి ప్రశంసలు లభించాయి. సినిమాను ఈషా ఫౌండేషన్‌లో ప్రదర్శించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.  


Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?


కాంతార @ 375 కోట్లు ప్లస్!
'కాంతార' సినిమాకు లభిస్తున్న గౌరవం పక్కన పెడితే... వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా మంచి జోరు మీద ఉంది. బాక్సాఫీస్ దగ్గర విజయయాత్ర కొన్ని రోజులు కొనసాగింది. భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. కన్నడలో సెప్టెంబర్ 30న సినిమా విడుదల అయ్యింది. పదిహేను రోజుల తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ పాతిక రోజుల్లో అన్ని భాషల్లో వసూళ్లు చూస్తే... 375 కోట్ల రూపాయలు దాటింది. త్వరలో 400 కోట్లు దాటుతుందని టాక్. 


భాషలకు, ప్రాంతాలకు అతీతంగా 'కాంతార'ను ప్రజలు ఆదరిస్తున్నారు. సినిమాలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, భూత కోలతో పాటు సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో తమ బాణీని కాపీ చేశారంటూ లీగల్ నోటీస్ రావడం చిత్ర బృందానికి షాక్ అని చెప్పాలి. తాము స్వరపరిచిన 'నవసర...'కు 'వరాహ రూపం' కాపీ అని 'తైక్కుడం బ్రిడ్జ్' సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. 


'కాంతార' నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది. 


Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?