ఆస్కార్స్... ఆస్కార్స్... ఆస్కార్స్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న అవార్డు వేడుక. అవార్డులకు ముందు ఏయే చిత్రాలకు, ఎవరెవరికి నామినేషన్స్ లభిస్తుంది? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆస్కార్ బరిలో భారతీయ సినిమాలు కూడా ఉండటంతో ఇండియన్స్ కూడా చాలా ఆసక్తిగా ఆస్కార్స్ వైపు ఓ కన్నేసి ఉంచారు.


ఆస్కార్స్‌కు అర్హత సాధించిన రిషబ్ శెట్టి
కన్నడ కథానాయకుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కాంతార' (Kantara Movie). పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. తొలుత కన్నడలో విడుదల చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సక్సెస్ సాధించింది. ఇప్పుడీ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. 


ఆస్కార్స్‌లోని రెండు విభాగాల్లో తమ సినిమా అర్హత సాధించిందని హోంబలే ఫిల్మ్స్ ఈ రోజు ట్వీట్ చేసింది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు విభాగంలో 'కాంతార'కు అర్హత లభించింది. ఇప్పుడు 'కాంతార' క్వాలిఫికేషన్స్‌లో ఉండటంతో కన్నడ సినిమా అభిమానులు, కర్ణాటక ప్రజలు, ఆ సినిమా ఫ్యాన్స్ సంతోషంలో మునిగారు. క్వాలిఫికేషన్స్ ఓకే, నామినేషన్ లభిస్తుందా? లేదా? అనేది చూడాలి. 






దర్శక ధీరుడు రాజమౌళి తీసిన దేశభక్తి సినిమా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా ఆస్కార్ బరిలో ఉంది. ముఖ్యంగా ఎంఎం కీరవాణి సంగీతంలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు...' సాంగ్ అర్హత సాధించింది. ఈ ఏడాది ఇండియా నుంచి ఆలియా భట్ 'గంగూబాయి కథియావాడి', 'కిచ్చా' సుదీప్ 'విక్రాంత్ రోణ', ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ తీసిన 'రాకెట్రీ' సినిమా పేర్లు కూడా వినబడుతున్నాయి. 


ఆస్కార్స్‌లో ఇండియా నుంచి మరో మూడు 
ఇండియా నుంచి 'చెల్లో షో' (ద లాస్ట్ ఫిల్మ్ షో) 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్' కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్' కేటగిరీలో 'ఆల్ ద బ్రీత్స్'... 'బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' కేటగిరీలో 'ద ఎలిఫాంట్ విష్పర్స్' కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. అవి కూడా ఇండియా నుంచి వెళ్ళినవే.


Also Read : 'అన్‌స్టాపబుల్‌ 2'లో వీర లెవల్ మాస్ ఎపిసోడ్ లోడింగ్ - ఫిక్స్ అయిపోండి, సంక్రాంతికి రీసౌండ్


గత ఏడాది విడుదలైన సినిమాల్లో నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించించిన సినిమాల్లో 'కాంతార' ఒకటి. సుమారు 400 కోట్ల రూపాయలు వసూలు చేసి కన్నడ సినిమా సత్తాను మరోసారి చాటింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేసింది. 


Also Read : లోకేష్‌ను కలిసిన తారకరత్న - ఎమ్మెల్యే టికెట్ విషయమై చర్చలు?


తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రేక్షకులు సైతం 'కాంతార'పై ప్రశంసల జల్లులు కురిపించారు. రిషబ్ శెట్టి, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్, తెలుగులో పంపిణీ : అల్లు అరవింద్ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకత్వం : రిషబ్ శెట్టి.