ఆధ్యాత్మిక కేంద్రమైన ఇషా ఫౌండేషన్‌లో 'కాంతార' సినిమా (Kantara Movie) ను ప్రదర్శించారు. అయితే? అందులో స్పెషల్ ఏముంది? అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ! సద్గురు అలియాస్ జగ్గీ వాసుదేవ్ బాబాకు చెందిన ఇషాలో సినిమా ప్రదర్శన అనేది చాలా అంటే చాలా అరుదు. అసలు వివరాల్లోకి వెళితే...
 
ఇంతకు ముందు ఇషా ఫౌండేషన్‌లో ప్రదర్శించిన ఏకైక సినిమా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మణికర్ణిక'.  ఇప్పుడు ఆ ఘనతను 'కాంతార' సినిమా అందుకుంది. దీపావళి సందర్భంగా షో వేశారు.  ఈ విషయాన్ని ఇషా ఫౌండేషన్ ట్వీట్ చేసింది.


కాంతార @ 200 కోట్లు!
'కాంతార' సినిమాకు లభిస్తున్న గౌరవం పక్కన పెడితే... వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా మంచి జోరు మీద ఉంది. బాక్సాఫీస్ దగ్గర రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ విజయయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. కన్నడలో సెప్టెంబర్ 30న సినిమా విడుదల అయ్యింది. పదిహేను రోజుల తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ పాతిక రోజుల్లో అన్ని భాషల్లో వసూళ్లు చూస్తే... రెండు వందల కోట్ల రూపాయలు దాటింది. 


Also Read : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' @ టెంపుల్ సెట్!



భాషలకు, ప్రాంతాలకు అతీతంగా 'కాంతార'ను ప్రజలు ఆదరిస్తున్నారు. సినిమాలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, భూత కోలతో పాటు సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో తమ బాణీని కాపీ చేశారంటూ లీగల్ నోటీస్ రావడం చిత్ర బృందానికి షాక్ అని చెప్పాలి. తాము స్వరపరిచిన 'నవసర...'కు 'వరాహ రూపం' కాపీ అని 'తైక్కుడం బ్రిడ్జ్' సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. 



'కాంతార' నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది. ఆయన సినిమాను అవుట్ రేటుకు కొనకుండా కమిషన్ బేసిస్ మీద విడుదల చేసినట్టు సమాచారం. అందువల్ల, ఆయనకు వచ్చే లాభాలు తక్కువే. 


తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రేక్షకులు సైతం 'కాంతార'పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. లేటెస్టుగా సినిమాను పూజా హెగ్డే చూశారు. చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


రిషబ్ శెట్టి, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్, తెలుగులో పంపిణీ : అల్లు అరవింద్ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకత్వం : రిషబ్ శెట్టి.