Munugode Bypoll News: ఎన్నికలు అంటేనే కానుకలు, తాయిలాలు అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అలాంటిది మునుగోడు లాంటి ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీలు పెట్టే ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికపైనే అందరి దృష్టీ పడి ఉంది. ఓటర్లను తమ వశం చేసుకోవడానికి ఇప్పటికే జోరుగా మద్యం, డబ్బులు చెలామణి జరుగుతోంది.
ఇప్పటికే చాలాసార్లు చాలా సందర్భాల్లో భారీ ఎత్తున డబ్బులు పట్టుబడ్డాయి. ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి. ఇంకా తెరవెనుక గుట్టుగా జరుగుతున్న డబ్బుల చెలామణీ లెక్కే లేదు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రలోబాలను కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అయింది. అందుకోసం అదనపు వ్యయ పరిశీలకులను మునుగోడుకు పంపింది. అటూ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఏడుగురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరు వ్యయ పరిశీలకులకు సాయం చేస్తారు. అంతేకాకుండా, నియోజకవర్గంలో అక్రమంగా నగదు లావాదేవీల నియంత్రణపై వీరు ఫోకస్ చేస్తారు.
ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం
ఎన్నికల ప్రలోభాలకు గురి చేసే ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం ఓ నెంబరును కూడా ఏర్పాటు చేసింది. 08682 - 230198 టోల్ ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ నెంబరుకు ఫిర్యాదులు చేయవచ్చని ఎన్నికల సంఘం అధికారులు తెలపగా.. ఇప్పటి వరకు ఈ కంట్రోల్ రూమ్‌కు మాత్రం ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు రాలేదని అధికారులు చెప్పారు.
మరోవైపు, మీడియాలో విపరీతమైన కథనాలు వస్తున్నందున అధికారులు ప్రజల నుంచి వాకబు చేసే పనికి శ్రీకారం చుట్టారు. 14 మంది టీమ్‌లో నలుగురిని ఫిర్యాదులను పరిశీలించేందుకు కేటాయించారు. మిగిలిన పది మంది అన్ని మండలాల్లోని ఓటర్లకు ర్యాండమ్‌గా ఫోన్ చేసి అవకతవకల గురించి తెలుసుకుంటారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం ఉంటే తీసుకుంటారు. ఆ వివరాల ఆధారంగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు చెబుతున్నారు.
చెక్ పోస్టుల దగ్గర ఉండే కెమెరాలను లైవ్ గా పరిశీలించే ఏర్పాట్లు కూడా చేశారు. నల్గొండ కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరపు వ్యక్తులు అన్ని చెక్ పోస్టుల వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే వెసులుబాటు కల్పించారు.
ఈసీ ఎన్ని చర్యలు చేపట్టినా పంపిణీ అయ్యే డబ్బులు, మద్యం, విందులకు అడ్డుకట్ట పడుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాపకింద నీరులాగా సైలెంట్ గా జరిగిపోయే ఈ ప్రలోభాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమైన తేదీలు
- ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
- నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
- నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
- పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
- కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022