విటమిన్లు, మినరల్స్ శరీరానికి చాలా అవసరం. అవి లోపిస్తే శరీరంలో అనారోగ్య లోపాలు తలెత్తుతాయి. అందుకే తప్పనిసరిగా విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలనో లేదా వాటికి సంబంధించి సప్లిమెంట్లు కూడా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. అతిగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అందకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. మానసిక పరిస్థితి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ, ఎర్ర రక్తకణాల ఏర్పాటుకి విటమిన్ బి 12 చాలా అవసరం. ఇది సక్రమంగా లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అదే పరిస్థితి ఇక్కడ 83 ఏళ్ల వ్యక్తికి ఎదురైంది. విటమిన్ బి 12 లోపం కారణంగా అతడి చేతుల వేళ్ళల్లో పరాస్థీషియా వచ్చింది.
పరాస్థీషియా అంటే చేతి లేదా కాలి వేళ్ళల్లో తిమ్మిర్లు, రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం, దురద, మంటలు వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా చేతులు, కాళ్ళు ప్రభావితం అవుతాయి. దీన్ని తగిన సమయంలో గుర్తించి చికిత్స పొందకపోతే అవి శరీరంలోని ఇతర భాగాలకి కూడా వ్యాపించే ప్రమాదం ఉంది.
పరాస్థీషియా వల్ల 83 ఏళ్ల వ్యక్తి అనుభవించిన లక్షణాలు
☀ వెర్టిగో(తల తిరగడం లేదా మైకం)
☀ ఎగువ పొత్తి కడుపులో నొప్పి
☀ ఆకలి లేకపోవడం
☀ ఆలసట
☀ శారీరకంగా ఎటువంటి పని చేయలేక ఇబ్బంది పడటం
బాధితుడు తీవ్రమైన విటమిన్ బి 12 లోపం కారణంగా ఆస్పత్రిలో చేరడానికి రెండు లేదా మూడు నెలల ముందు నుంచి ఈ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు. ఇది కాలక్రమేణా ఎక్కువ అయ్యింది. పరీక్షలు చేయించుకోగా విటమిన్ బి 12 లోపం అని అందుకే ఇలా జరిగిందని వైద్యులు గుర్తించారు. ఇంజెక్షన్స్ ద్వారా అతడు ఈ లోపం నుంచి బయటపడే విధంగా పోషకాలు అందించారు. సుమారు రెండు సంవత్సరాల చికిత్స తర్వాత ఎలాంటి లక్షణాలు అతడిలో కనిపించలేదు.
విటమిన్ బి 12 లోపం లక్షణాలు
విటమిన్ B12 లోపం వల్ల కలిగే లక్షణాలు కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుంది. చికిత్స చెయ్యడానికి ఎక్కువ సమయం తీసుకుంటే శాశ్వత నష్టం జరిగే ప్రమాదం ఉంది.
☀ నోటి పూత
☀ చిరాకు
☀ చర్మం పసుపు రంగులోకి మారడం
☀ గొంతు, నాలుక ఎర్రగా మారిపోవడం’
☀ దృష్టి లోపం
☀ డిప్రెషన్
☀ ప్రవర్తనలో మార్పులు
☀ డిమెన్షియా
☀ జ్ఞాపకశక్తి సమస్యలు
☀ శరీరంలోని కొన్ని భాగాల్లో సూదులుతో గుచ్చుతున్నట్టుగా అనిపించడం
విటమిన్ బి 12 లోపానికి చికిత్స
ఇంజెక్షన్లు లేదా పోషకాహారం తీసుకోవాలి. జంతు వనరుల ద్వారా ఈ విటమిన్ పొందవచ్చు. అయితే శాఖాహారులు పోషకాహారం ద్వారా విటమిన్ బి 12 పొందాలంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. అందుకే ఇతర సప్లిమెంట్ల ద్వారా దాన్ని తీసుకోవాలి.
విటమిన్ బి 12 లభించే ఆహారం
☀ జంతువుల కాలేయం, మూత్రపిండాలు
☀ గొడ్డు మాంసం
☀ సాల్మన్ చేపలు
☀ షెల్ఫిష్
☀ ట్యూనా చేపలు
☀ గుడ్లు
☀ పాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: డయాబెటిక్ రెటినోపతిని ఎలా గుర్తించాలి? కంటి చూపు శాశ్వతంగా పోతుందా?