ప్రముఖ కన్నడ నటుడు యశ్‌ కథానాయకుడిగా నటించిన KGF సినిమా గురించి ‘కాంతార’ సినిమాలో అటవీ అధికారిగా కీలక పాత్ర పోషించిన నటుడు జి.కిషోర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. KGF సినిమాను తాను ఇప్పటికీ చూడలేదన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషోర్‌ KGF గురించి మాట్లాడారు. అసలు KGF తాను చూడలేదని, ఇలా అనడం తప్పో రైటో కూడా తనకు తెలీదని అన్నారు. కేజీఎఫ్‌ తనకు సూట్‌ అయ్యే సినిమా కాదని తెలిపారు. సినిమా ఎంత బ్లాక్‌ బస్టర్ అయినప్పటికీ ఆ సినిమాను చూడాలా వద్దా అనేది తన పర్సనల్ ఛాయిస్‌ అని చెప్పారు. అంతేకాదు తన ఉద్దేశంలో సినిమా అంటే ఒక సీరియస్ ఇష్యూ గురించి అయివుండాలి. కానీ బుర్ర తక్కువ ఎంటర్‌టైనర్‌లా ఉండకూడదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.


‘‘నేను ఇలా చెప్పచ్చో లేదో తెలీదు కానీ.. నేను కేజీఎఫ్‌ చూడలేదు. అది అసలు నా టైప్‌ సినిమా కాదు. ఒక సినిమా చూడాలా వద్దా అనేది నా పర్సనల్ ఛాయిస్. సక్సెస్ కాకపోయినా సీరియస్ అంశంతో తీసిన ఓ చిన్న సినిమాను అయినా చూస్తా. కానీ పెద్ద బడ్జెట్‌తో బుర్రతక్కువ సినిమాలను తీస్తే మాత్రం నేను చూడను’’ అని అన్నారు. అయితే కిషోర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘కాంతార’ సినిమాతో పేరు రాగానే అదే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన KGF సినిమాపై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ అభిమానులు చీవాట్లు పెడుతున్నారు. సినిమా చూడకపోవడం తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఇలా ఓ సినిమాను పట్టుకుని బుర్రలేని కథ అంటూ వ్యాఖ్యానించండి పెద్దరికం కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.


ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలింస్ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’. ఇండియాలో ఈ సినిమా విజయం సాధించి కోట్లల్లో వసూళ్లు కురిపించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిషోర్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. మరోపక్క కిషోర్‌ తన ట్విటర్ ఖాతాలో వివాదాస్పదమైన పోస్ట్ చేయడంతో ఆయన ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దాని గురించి కూడా ఆయన స్పందించారు. తన ఖాతాను ఎవరో హ్యాక్‌ చేయడంతో ట్విటర్ ముందు జాగ్రత్తగా తొలగించిందే తప్ప.. తాను ఎటువంటి వివాదాస్పద ట్వీట్స్ చేయలేదని వివరణ ఇచ్చారు. యాక్టివేషన్‌ ప్రాసెస్‌ అంతా సవ్యంగా జరిగాక మళ్లీ తన ఖాతా యాక్టివ్‌ అవుతుందని తెలిపారు.


అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ సినిమాలో కిషోర్ పోలీసు అధికారిగా కనిపించారు. ఈ సినిమాతోనే ఆయన తెలుగు కెరీర్‌ మొదలైంది. దీంతో పాటు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో రవిదాసన్ అనే పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన హిందీలో ‘రెడ్ కాలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ద్వారా తాను బాలీవుడ్‌కి వెళుతున్నట్లు అనుకోవడంలేదని, కేవలం ఓ సినిమాను హిందీలో తీస్తున్నట్లే అనిపిస్తోందని చెప్పారు.




Also Read: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!