Kalki 2898 AD Trailer Review: వాహ్..ఏమన్నా ఉందా కల్కి ట్రైలర్. పిచ్చి పీక్స్ అంతే. మనం అంతా చిన్నప్పుడు స్టార్ వార్స్, ఏలియన్ సినిమాలు చూసి ఉంటాం. ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి రోబో కార్ల కథలు ఊది పడేశాం. కానీ మనసులో ఎక్కడో చిన్న వెలితి. మన ఇండియన్ సినిమా ఎప్పుడు రా ఆ స్టాండర్డ్స్ అందుకునేది అని తెగ గింజేసుకుని ఉంటాం. అంతెందుకు మొన్నటికి మొన్న డేనిస్ విల్నెవ్ 'డ్యూన్' పేరుతో రెండు పార్టులుగా మరో ప్రపంచం సినిమాను విడుదల చేస్తే అబ్బా ఇది కదా మనకు కావాల్సిన కంటెంట్ అనుకున్నాం. అలాంటి తెలుగు ప్రేక్షకుల ఎదురు చూపులు ఫలించాయి. వైజయంతీ బ్యానర్‌పై తెలుగోడి సత్తా చాటేలా 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD) పేరుతో ఇంటర్నేషనల్ సరుకు దిగుతోంది. బక్క పలుచటి దేహం, పొడవాటి కేశాలతో నాగి అని పిలువబడే నాగ్ అశ్విన్ తన కలల ప్రాజెక్టును భారతీయ ప్రేక్షకులకు గిఫ్ట్ గా అందిస్తున్నాడు. గిఫ్ట్ అని ఎందుకు అంటున్నామో ఈ రోజు విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది.


నేల విడిచి సాము చేయకుండా...
చెడుపై మంచి సాధించాల్సిన విజయం. పాతాళ భైరవి సినిమా నుంచీ ఇదే తెలుగు సినిమా టోప్. ఈసారి కూడా నేల విడిచి సాము ఏం చేయలేదు నాగ్ అశ్విన్. ఇండియన్స్ కనెక్ట్ అయిపోయే ఓ మాములు కథనే తీసుకున్నాడు. కాకపోతే మన ఇండియన్ మైథాలజీని దానికి రూట్ చేశాడు. ఈ భూమి మీద మొదటి నగరం, చివరి నగరమైన 'కాశీ' నుంచి సర్వస్వం లాగేసుకున్న 'కాంప్లెక్స్' అనే మహానగరంపై మనుషులు ఎలా విజయం సాధించారనేది కథ అని స్పష్టమవుతోంది. అయితే ఆ పోరాటానికి కారణభూతం కావాల్సిన ఓ ప్రాణం ఇంకా ఈ ప్రపంచంలోకి రాని ఆ పిండాన్ని కాపాడాలి. దీపికా పదుకోన్ కడుపులోని ఆ ప్రాణానికి కాపలాగా అమితాబ్ పోషించిన అశ్వత్థామ లాంటి పాత్రలు..ఈ మిషన్ ముందుకు తీసుకువెళ్లాల్సిన భైరవ లాంటి ప్రభాస్ పోషించిన పాత్రలు..హెల్ప్ చేసే బుజ్జి లాంటి రోబో వెహికల్స్ వెరసి మొత్తంగా కల్కి ఓ మాస్ మసాలా మిక్చర్ పొట్లం.


సూపర్ హీరోకి మైథాలజీ టచ్...
టిపికల్ సూపర్ హీరో ఫార్మూలాకి ఇండియన్ మైథాలజీ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో నాగి చేసి చూపించాడు. ప్రతీ లైన్ అండ్ ప్రతీ పాత్రకు ఓ మైథలాజికల్ కనెక్షన్ ఉండేలా రాసుకుంటూ వెస్ట్రన్ వరల్డ్‌కి మన పురాణాలని పరిచయం చేసే కార్యక్రమం మొదలు పెట్టాడు. అది కూడా చాలా ట్రెండీగా. ఇక కమల్ హాసన్ లాంటి లెజండరీ యాక్టర్ ను ఓ విలన్ గా, కాంప్లెక్స్ కి అధిపతిగా, ఓ వికృతమైన ఫేస్ తో చూపించటం నాగి తీసుకున్న సాహసోపేత నిర్ణయం. కంగారు పడకు మరో ప్రపంచం వస్తుంది అని కమల్ చెప్పిన డైలాగ్ వెనుక ఉద్దేశం ఏంటీ.? కలియుగం ఆరంభం నుంచి కల్కి అవతారం వరకూ జరిగిన జరగబోయే ఒక్కో ఈవెంట్‌కి నాగ్ అశ్విన్ ఎలాంటి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చారనేది ఆసక్తికరమైన అంశం.


ట్రైలర్ లో కనిపిస్తున్న ఫ్యూచరిస్టిక్ వెహికల్స్, కళ్లు చెదిరిపోయేలా గ్రాండ్ స్పేస్ లో కనిపిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్, ఆ మహానగరాలు అన్నీ ఒక్కొక్కటి తెర మీదకు తీసుకురావటం ఈ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వటం సాధారణమైన విషయం కాదు. క్రీస్తుపూర్వం 3102 బీసీ నుంచి ఆరు వేల సంవత్సరాలు ప్రయాణించి క్రీస్తు శకం 2898లో మళ్లీ మహాశక్తిగా తిరిగి వస్తున్న ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటి? ఈ రైడర్స్ కి మనుషులకు మధ్య జరుగుతున్న పోరాటానికి కారణాలేంటీ? 600 కోట్ల రూపాయల ఖర్చుతో నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమా తెరపై తీసుకువస్తున్న అత్యంత కాస్ట్లీ సినిమా వెనుక అతనికున్న ఆ కాన్ఫిడెన్స్ ఏంటీ తెలియాలంటే మాత్రం జూన్ 27వ తేదీ వరకూ ఆగాల్సిందే. మొత్తంగా ఇండియన్ సినిమాటిక్ స్పేస్ లో హాలీవుడ్ రేంజ్ సినిమా దిగుతోంది అనే విషయమైతే పక్కా.