తెలుగు సినిమా రంగంలో నవరస నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాల కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కైకాల పార్థివదేహాన్ని అభిమానులు, సీనీ నటుల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. టాలీవుడ్ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఆయన పాార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన ఉన్న అనుభూతుల్ని గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు.  


కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. శనివారం ఉదయం కైకాల నివాసం వద్ద నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అనంతరం జూబ్లిహిల్స్‌ లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.


కైకాల కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో 1935 న జన్మించారు కైకాల సత్యనారాయణ. గుడివాడలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. చదువుతున్న రోజుల్లోనే ఆయన ఎక్కువగా నాటకాల్లో ప్రదర్శనలు చేశారు. డిగ్రీ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్ తో  ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కైకాల. 'సిపాయి కూతురు' ఆయన మొదటి సినిమా. పౌరాణికం, జానపదం, కమర్షియల్ ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్ గా నటించి మెప్పించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.


ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి నాటి తరం నటులతోనే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లతోనూ కొంతమంది యువ హీరోలతోనూ నటించారు. దశాబ్దాల సినీ అనుభవం, ఆరు తరాల హీరోలతో కలసి పనిచేయడం, వందలాది సినిమాలు, వేలాది పాత్రలు అన్నీ కైకాలకే సాధ్యం. కేవలం నటుడిగానే కాదు. అటు రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని సుస్థిర స్థానాన్ని సంపాదించారు కైకాల. 


కైకాల మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కైకాల మృతి తో తీవ్ర విషాదం లో మునిగిపోయింది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ పార్థివదేహం వద్ద అగ్ర కథానాయకులు చిరంజీవి, పవన్,వెంకటేష్, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, త్రివిక్రమ్, నివాళులర్పించారు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం చిరంజీవి కైకాల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చి భరోసా ఇచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించన పలువురు ప్రముఖులు నేడు కైకాలా అంతియ యాత్రలో పాల్లొన్నారు. 


Also Read: ధమాకా రివ్యూ - 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?