Kaikala Satyanarayana As Villain:
ఎస్‌వీ రంగారావు తరవాత..
సినిమా అంటే హీరో ఉండాలి. విలన్ ఉండాలి. హీరో విలన్‌ను పడగొట్టాలి. ఇదీ సినిమా ఫార్ములా. అలా అని హీరో చాలా దృఢంగానూ...విలన్ బక్క పల్చగానూ ఉండొద్దు. ఇద్దరూ సమవుజ్జీలుగా ఉండాలి. ఇదిగో...ఈ ట్రెండ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు ఎస్‌వీ రంగారావు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో విలన్ షేడ్స్ ఉన్న ఏ పాత్ర అయినా ఎస్‌వీ రంగారావుని వెతుక్కుంటూ వచ్చేది. నిర్మాతలు, దర్శకులు మారుతున్నా...ఆ క్యారెక్టర్‌లో రంగారావు తప్ప మరెవరూ కనిపించకపోయేవాళ్లు. అసలు ఆయనను తప్ప మరెవరినీ ఊహించుకోలేదు సినీ ప్రేక్షకులు. భక్త ప్రహ్లాదలో హిరణ్య కశపుడు, మాయా బజార్‌లో ఘటోత్కచుడి పాత్రలు ఎస్‌వీ రంగారావులోని నటనా కౌశలాన్ని మరో మెట్టు ఎక్కించాయి. ఆ తరవాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తన అద్భుత నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. ఎస్‌వీ రంగారావు తరవాత మళ్లీ "ఆల్ రౌండర్" బిరుదు దక్కించుకుంది కైకాల మాత్రమే. అప్పటికే తెలుగు తెరపై విలన్ల కొరత ఏర్పడింది. ఎస్‌వీ రంగారావు ముందు వరకూ నాగభూషణం విలన్ పాత్రలకు జీవం పోస్తే...ఎస్‌వీ రంగారావు తరవాత మళ్లీ ఆ స్థాయిలో విలనిజాన్ని పండించారు సత్యనారాయణ. హీరోగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఎన్‌టీఆర్ సలహాతో..
సిపాయి కూతురుతో తెరంగేట్రం చేసినా...ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరవాత "ఇప్పుడేం చేయాలి" అన్న సందిగ్ధంలో ఉన్న కైకాలను..వెన్నుతట్టి ప్రోత్సహించారు సీనియర్ ఎన్‌టీఆర్. ఆ ప్రోత్సాహమే కైకాల నట జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కేవలం హీరోగానే నటించాలన్న నియమాన్ని పక్కన పెట్టి విలన్ పాత్రలకూ ఓకే చెప్పారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యారు కైకాల. విలనిజంలోని కొత్త షేడ్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. చూపులతోనే భయపెట్టగలగడం కైకాల ప్రత్యేకత. ఆయన కంచు కంఠం ఆయనకు మరో ప్లస్. గట్టిగా ఒక్క డైలాగ్ చెబితే చాలు. ఇతను విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడా..లేదంటే నిజంగానే ఈయన విలనా..? అనే స్థాయిలో జీవం పోశారు ఆ పాత్రలకు. ఎన్‌టీఆర్ సలహాతో విఠలాచార్య వద్దకు వెళ్లి "నేను విలన్‌గా నటిస్తాను" అని ధైర్యంగా చెప్పారు కైకాల. అప్పటికే కైకాల ప్రతిభ గురించి తెలుసుకున్న విఠలాచార్య వెంటనే అవకాశమిచ్చారు. కనకదుర్గ పూజా మహిమ అనే చిత్రంతో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కైకాల సత్యనారాయణ. అది సూపర్
హిట్ అయింది. అక్కడి నుంచి వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. విలన్‌గా రాణించారు. హీరోలకు సరి సమానంగా నటిస్తూ "విలన్ అంటే ఇలా ఉండాలి" అని అనిపించుకున్నారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్‌టీఆర్‌తో కలిసి దాదాపు 100 చిత్రాల్లో నటించారు కైకాల. పలు చిత్రాల్లో ఎన్‌టీఆర్‌కి డూప్‌గానూ చేశారు. కైకాల ఆహార్యం ఇంచుమించు ఎన్‌టీఆర్‌లానే ఉంటుంది. అందుకే...దర్శక నిర్మాతలు ఎన్‌టీఆర్ డూప్ అనగానే కైకాలను సంప్రందించేవాళ్లు.
Also Read: రాజకీయాల్లోనూ మెరిసిన కైకాల- మచిలీపట్నం ఎంపీగా చేసిన సత్యనారాయణ!