Kaathal The Core OTT Streaming: మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్నారు. 'కన్నూర్ స్క్వాడ్' సక్సెస్ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘కాథల్ ది కోర్’. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన జ్యోతిక నటించింది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుంది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో ఈ మూవీ కొనసాగుతోంది. నవంబర్ 23న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ హీరో సూర్య, మరో నటుడు సిద్ధార్థ్ ఈ సినిమా చాలా గొప్పగా ఉందన్నారు. జ్యోతిక సైతం ఈ చిత్రంలో మమ్ముట్టి నటనకు ఫిదా అయినట్లు చెప్పింది. ఆయన హీరోలకే హీరో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కాథల్ ది కోర్’ స్ట్రీమింగ్
బ్లాక్ బస్టర్ ‘కాథల్ ది కోర్’ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో వారికి గుడ్ న్యూస్ అందించింది అమెజాన్ ప్రైమ్ వీడియో. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
‘కాథల్ ది కోర్’ కథ ఏంటంటే?
బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్(మమ్ముట్టి), ఆయన సతీమణి ఓమన(జ్యోతిక)తో కలిసి ఓ పల్లెటూరులో నివసిస్తుంటారు. ఆ ఊరిలో పంచాయతీ ఎన్నికలు రావడంతో మమ్ముట్టి పోటీ చేయాలని భావిస్తారు. అధికారులకు నామినేషన్ పత్రాలు కూడా అందజేస్తారు. అదే సమయంలో జార్జ్ భార్య ఓమన కోర్టులో కేసు వేస్తుంది. డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో తన భర్తకు స్వలింగ సంబంధం ఉందని ఆరోపిస్తుంది. తనకు విడాకులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతుంది. ఈ ఆరోపణలను మమ్ముట్టి ఖండిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారికి విడాకులు వచ్చాయా? ఇంతకీ ఆమె ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది? అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాను కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా మూవీ ఉందని ఈ నిర్ణయం తీసుకున్నాయి.
వరుసగా 4 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్
అటు 2023లో మమ్ముట్టి నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'నాన్ పాకల్ నేరతు మాయక్కమ్', 'క్రిస్టోఫర్', 'కన్నూర్ స్క్వాడ్' సహా 'కాథల్ ది కోర్' సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 'కాథల్ ది కోర్' సినిమాను మమ్ముట్టి కంపానీ, వేఫేరర్ ఫిలింస్ బ్యానర్ కలిసి నిర్మించాయి. మాథ్యూస్ పులికాన్ సంగీతం అందించారు.
Read Also: ఆమాట విని తారక్ సీరియస్ అయ్యారు, రామ్ చరణ్ బ్రేక్ తీసుకుందాం అన్నారు - రాజీవ్ కనకాల