Virender Sehwag News: కేప్‌టౌన్‌(Cape Town) వేదికగా జరిగిన రెండో టెస్ట్‌... రోజున్నరలోనే ముగియడంతో పిచ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. దక్షిణాఫ్రికా(South Africa) కోచ్‌ కూడా దీనిపై విస్మయం వ్యక్తం చేశాడు.పిచ్‌ ఇలా అనూహ్యంగా బౌన్స్‌ కావడంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్లే ప్రిన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆశ్చర్యపోయాడు. తొలి రోజే పిచ్‌ ఇలా మారిపోవడం చూడలేదని... బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారని...కేప్‌ టౌన్‌లో మాత్రం విపరీతమైన బౌన్స్‌ లభిస్తోందని అన్నాడు. పిచ్‌లోనే లోపం ఉండొచ్చని కూడా విశ్లేషించాడు. ఈ విమర్శలకు టీమిండియా(Team India) మాజీ దిగ్గజాలు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయబట్టే గెలిచారని  టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) కౌంటర్‌ ఇచ్చాడు. మీరు చేస్తే మ్యాజిక్... మేము చేస్తే పిచ్ లోపమా అని ఎక్స్‌లో గట్టిగా ఇచ్చిపడేశాడు. ఈ మ్యాచ్‌లో భారత సీమర్లు చెలరేగిపోయారని.. నాణ్యమైన పేస్‌తో ప్రొటీస్‌ బ్యాటర్లను కట్టిపడేశారని కొనియాడాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారని.. జట్టు విజయంలో వీళ్లిద్దరు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఒక గొప్ప విజయంతో ఈ ఏడాది భారత జట్టు ప్రారంభించిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. సురేశ్ రైనా సైతం భారత జట్టు అద్భుత విజయం సాధించిందని పొగడ్తలతో ముంచెత్తాడు. 

 

విదేశీ మీడియాపై గవాస్కర్‌ ఆగ్రహం

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మొదటి రోజు 23 వికెట్లు పడ్డా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మీడియా  పెద్దగా హైలైట్‌ చేయకపోవడంపై గవాస్కర్‌ మండిపడ్డాడు. భారత్‌లో టర్నింగ్‌ పిచ్‌ల వల్ల ఎక్కువ వికెట్లు పడితే అక్కసు వెళ్లగక్కేలా ఈ విదేశీ మీడియా  ఇప్పుడు ఎందుకు పెద్దగా స్పందించడం లేదని నిలదీశాడు. 

 

సిరీస్‌ కోల్పోకుండా ముగింపు

భారత క్రికెట్‌ జట్టుదక్షిణాఫ్రికా పర్యటనను సిరీస్‌ ఓటమి లేకుండా ముగించింది. కేవలం 107 ఓటర్లు సాగిన రెండోటెస్టులో గెలిచిన భారత్‌ టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది. కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌.  తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల పతనాన్ని శాసించిన మహ్మద్‌ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా... కేప్‌టౌన్‌లో భారత్‌ తొలి విజయాన్ని నమోదుచేసింది. రెండో టెస్ట్‌ గెలుపుతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌రువాత... దక్షిణాఫ్రికాలో ప్రొటీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను డ్రా చేసుకున్న కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. ద‌క్షిణాఫ్రికాలో ఒక్క సారి కూడా భార‌త జ‌ట్టు టెస్టు సిరీస్‌ను గెల‌వ‌లేదు. ఇందులో ఏడు సార్లు ఓడిపోగా.. కేవ‌లం రెండు సంద‌ర్భాల్లో మాత్రమే టెస్టు సిరీస్‌ను స‌మం చేసింది. ధోనీ కెప్టెన్సీలో 2010-11లో 1-1తో, రోహిత్ సార‌థ్యంలో 2023-2024 ప‌ర్యట‌న‌లో 1-1తో టెస్టు సిరీస్‌ల‌ను స‌మం చేసింది.