K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath Passed Away : కళాతపస్వి కె. విశ్వనాథ్ కోరిక ఒకటి ఇంకా తీరలేదు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు... హిందీ ప్రేక్షకులనూ ఆయన తన కథలతో మెప్పించారు.

Continues below advertisement

కె. విశ్వనాథ్ (K Viswanath) తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన దర్శకుడు కాదు... ఉత్తరాది ప్రేక్షకులకూ ఆయన తెలుసు. మన కళాతపస్వి, కాశీనాథుని విశ్వనాథ్ తన సినిమాలతో హిందీ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అక్కడ కూడా విజయాలు అందుకున్నారు. విశ్వనాథ్ బాలీవుడ్ కెరీర్ గురించి ఒక్కసారి చూస్తే... 

Continues below advertisement

హిందీలో తొలి సినిమా...
ఏళ్ళ తరబడి సెట్స్‌లో!
హిందీ చిత్రసీమకు వెళ్ళాలని విశ్వనాథ్ ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి, ఆయన బాలీవుడ్ ఎంట్రీ చాలా చిత్రంగా జరిగింది. కాంతారావు, చంద్ర మోహన్, రోజా రమణి ప్రధాన తరాలుగా విశ్వనాథ్ తీసిన 'ఓ సీత కథ' హిందీ నటుడు, నిర్మాత ప్రేమ్ జీకి నచ్చింది. రీమేక్ చేసి పెట్టమని పట్టుబట్టడంతో కాదనలేక ఓకే అన్నారు.

'ఓ సీత కథ'లో రోజా రమణి చేసిన పాత్రకు హిందీలో రేఖను తీసుకున్నారు. ప్రేమ్ జీ నిర్మాణం, ఆయన పద్ధతి కారణంగా ఆ సినిమా ఏళ్ళ తరబడి సెట్స్‌లో ఉంది. ఆ సమయంలో విశ్వనాథ్ తెలుగులో చాలా బిజీ. అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ శశిలాల్ నాయర్ చేతిలో దర్శకత్వ బాధ్యతలు అప్పగించి పూర్తి చేయమన్నారు. చివరకు, ఎప్పుడు విడుదలైందో తెలుసా? 1996లో! ఆ సినిమా పేరు 'ఔరత్... ఔరత్... ఔరత్'. ఆ సినిమా కంటే ముందు విశ్వనాథ్ హిందీకి దర్శకుడిగా వెళ్ళారు.

హిందీ 'సర్‌గమ్‌'...
సిసలైన ఎంట్రీ
తెలుగు ప్రేక్షకులకు 'సిరి సిరి మువ్వ' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాను హిందీలో 'సర్‌గమ్‌' పేరిట రీమేక్ చేశారు. అది విశ్వనాథ్ ఫస్ట్ హిందీ సినిమా. తెలుగులో నటించిన జయప్రద... హిందీలోనూ చేశారు. ఇక్కడ చంద్రమోహన్ నటించగా... హిందీలో ఆ పాత్రను రిషి కపూర్ చేశారు. 

K Viswanath Hindi Movies - Journey : 'సిరి సిరి మువ్వ' హిందీ రీమేక్ రైట్స్ నిర్మాత ఎన్.ఎన్. సిప్పీ సొంతం చేసుకున్నారు. దీక్షిత్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. సినిమా చూసిన దీక్షిత్... మాతృక తీసిన అతను అయితేనే బావుంటుందని చెప్పడంతో విశ్వనాథ్ దగ్గరకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత హిందీలోనూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 
'శంకరాభరణం' చిత్రాన్ని 'సుర్‌ సంగమ్‌'గా... 'సప్తపది'ని 'జాగ్‌ ఉఠా ఇన్సాన్‌'గా... 'శుభోదయం' సినిమాను 'కామ్‌చోర్‌'గా... 'జీవనజ్యోతి'ని 'సన్‌జోగ్‌'గా... 'శుభలేఖ' సినిమాను 'శుభ్‌ కామ్నా'గా... 'స్వాతిముత్యం' చిత్రాన్ని 'ఈశ్వర్‌'గా రీమేక్స్ చేశారు. 

కాపీ పేస్ట్ చేయలేదు
హిందీలో విశ్వనాథ్ పది సినిమాలు చేస్తే... అందులో ఎనిమిది తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలకు రీమేక్స్. హిందీ సినిమాలు రీమేక్ అయినప్పటికీ... ఆయన ఎక్కడా మక్కీకి మక్కీగా దించేయలేదు. కాపీ పేస్ట్, జిరాక్స్ టైపులో తీయలేదు. మాతృకలోని ఆత్మను చెడగొట్టకుండా జాగ్రత్త పడుతూ... మాతృకలో లోటుపాట్లు ఏమైనా అనిపిస్తే సవరిస్తూ... కథను వీలైనంత మెరుగ్గా చెప్పడానికి ప్రయత్నించారు. 

హిందీ స్ట్రెయిట్ సినిమాలకు వస్తే...
హిందీలో కె. విశ్వనాథ్ చేసిన స్ట్రెయిట్ సినిమాలు రెండు అంటే రెండు! వాటిలో ఒకటి... 'సంగీత్'. ఉత్తరాది నౌటంకీ నృత్యం నేపథ్యంలో రూపొందించారు. ఆ సినిమాలో మాధురీ దీక్షిత్ ప్రధాన తార. కళ్ళు లేని అమ్మాయిగా కనిపించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, కరిష్మా కపూర్‌, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా 'ధన్‌వాన్‌' సినిమా చేశారు. 

హిందీలో స్వయంకృషి...
విశ్వనాథ్ తీరని కోరిక
చిరంజీవి కథానాయకుడిగా విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం 'స్వయంకృషి'. దానిని హిందీలో రీమేక్ చేస్తే బావుంటుందని కళాతపస్వి ఆశపడ్డారు. అలాగే, 'అల్లుడు పట్టిన భరతం' చిత్రాన్నీ హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ కోరికలు తీరలేదు.  

Also Read : కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు... ఆయన జీవితంలో ఈ విషయాలు మీకు తెలుసా?

Continues below advertisement
Sponsored Links by Taboola