Jigarthanda DoubleX Dhanush Review: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘జిగర్తాండా డబుల్ఎక్స్’. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2014లో వచ్చిన ‘జిగర్తాండా’కు సీక్వెల్‌గా ‘జిగర్తాండా డబుల్ఎక్స్’ తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూని పాన్ ఇండియా హీరో ధనుష్ ఇచ్చారు. ఈ రివ్యూలో సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.
దర్శకత్వం, నటన అన్నీ సూపర్...
ఈ ట్వీట్‌లో ధనుష్ ‘జిగర్తాండా డబుల్ఎక్స్ చూశాను. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని చాలా బాగా తీశారు. అద్భుతంగా నటించడం ఎస్‌జే సూర్యకు అలవాటై పోయింది. ఒక నటుడిగా ఇది రాఘవ లారెన్స్‌కు మరో పార్శ్వం. సంతోష్ నారాయణన్ సంగీతం అందంగా ఉంది. చివరి 40 నిమిషాలు మీ మనసులు దోచుకుంటుంది. నటీనటులకు, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’. అని పేర్కొన్నారు.
ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో గతంలో ‘జగమే తంత్రం’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ ఇది తన మనసుకు నచ్చిన సినిమా అని ధనుష్ చాలా సందర్భాల్లో అన్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఎడిటింగ్ కారణంగా సినిమా ఫ్లాప్ అయిందని, ఉపయోగించని సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయని కార్తీక్ సుబ్బరాజ్ కూడా తెలిపారు. కాబట్టి వీరిద్దరి మధ్య బంధం ఫెవికాల్‌లా స్ట్రాంగ్‌గానే ఉంది.
ఇక ‘జిగర్తాండా డబుల్ఎక్స్’ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. 1975 నాటి కాలం నాటి కథతో ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ తీశారు. ఒక దర్శకుడు సినిమా తీయాలనుకోవడం, అందులో గ్యాంగ్‌స్టర్ హీరోగా నటించడం నేపథ్యంలో కథ సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
2014లో వచ్చిన ‘జిగర్తాండా’ తమిళంలో పెద్ద హిట్ అయింది. నెగిటివ్ రోల్‌లో నటించిన బాబీ సింహా ఏకంగా జాతీయ అవార్డు కూడా సాధించాడు. ఈ సినిమాను తెలుగులో అధర్వ, వరుణ్ తేజ్‌లతో ప్రముఖ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ చేశారు. ‘గద్దలకొండ గణేష్’ పేరుతో విడుదల అయిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.
అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లోని ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘గేమ్‌ఛేంజర్’ కథను కూడా కార్తీక్ సుబ్బరాజే అందించారు. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘జిగర్తాండా డబుల్ఎక్స్’ ప్రమోషన్లలో గేమ్ ఛేంజర్ గురించి కూడా కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడారు.
తన కెరీర్ లో రాసిన తొలి పొలిటిక్ స్టోరీ ‘గేమ్ ఛేంజర్’ అని కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు. “ఈ కథ ను పూర్తి చేసిన తర్వాత నా స్నేహితులకు చెప్పాను. చాలా మంది ఈ కథ చాలా బాగుందనే అభిప్రాయపడ్డారు. శంకర్ సినిమాల స్థాయిలో ఈ కథను తీయవచ్చు అన్నారు. స్టోరీని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పారు. శంకర్ స్థాయి రాజకీయ చిత్రం తీసే అనుభవం, స్థాయి నాకు లేదనుకున్నాను. అందుకే ఈ కథను నేరుగా శంకర్‌కే చెప్పాను. ఆయనకు కథ నచ్చడంతో సినిమాగా తెరకెక్కుతోంది. చాలా పెద్ద స్కేల్‌లో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. రామ్ చరణ్ నటించడంతో గేమ్ ఛేంజర్ స్థాయి మరింత పెరిగింది. తప్పకుండా తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను అలరిస్తుంది” అని కార్తీక్ అభిప్రాయపడ్డారు.