ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ ఆశలపై నీళ్లు చల్లేలా..అఫ్గాన్‌కు సెమీస్‌ ద్వారాలు మూసుకుపోయేలా శ్రీలంకపై ఏకపక్ష విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లు రాణించడంతో లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. అనంతరం డేవిన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, డేరిల్‌ మిచెల్‌ రాణించడంతో 23.2 ఓవర్లలో అయిదు వికెట్లే కోల్పోయి కివీస్‌ లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు 160 బంతులు మిగిలి ఉండగానే కివీస్‌ విజయం సాధించడంతో దాదాపుగా పాక్‌, అఫ్గాన్ సెమీస్‌ అవకాశాలు ముగిసినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్‌పై పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాపై అఫ్గాన్‌ భారీ విజయం సాధించి అద్భుతం సృష్టిస్తే తప్ప న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరడం ఖాయమైనట్లే.



 బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లంకను కివీస్‌ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో  పాతుమ్‌ నిసంక వికెట్‌ తీసిన టిమ్ సౌథీ.. లంక వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. ఎనిమిది బంతుల్లో రెండే పరుగులు చేసిన నిసంకను సౌథీ అవుట్‌ చేశాడు. మూడు పరుగుల వద్దే లంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది. కానీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్‌ లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌ను... అదే ఓవర్‌ నాలుగో బంతికి ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సధీర సమరవిక్రమను కూడా బౌల్ట్‌ అవుట్‌ చేయడంతో 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడిపోయింది. కానీ కుశాల్ పెరీరా పోరాడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా పెరీరా ఆచితూచి ఆడాడు. 70 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక... అదే స్కోరు వద్ద మరో వికెట్‌ కోల్పోయింది. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన ధాటిగా బ్యాటింగ్ చేసిన కుశాల్‌ పెరీరాను ఫెర్గ్యూసన్ అవుట్ చేశాడు. దీంతో లంక కష్టాలు మరింత పెరిగాయి.



 అయిదు వికెట్ల నష్టానికి శ్రీలంక70 పరుగులు చేయగా... అందులో 51 పరుగులు కుశాల్‌ పెరీరానే చేశాడు. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్‌, ధనుంజయ డిసిల్వా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆచితూచి ఆడిన వీరిద్దరూ లంక స్కోరును వంద పరుగులు దాటించారు. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద ఏంజెలో మాధ్యూస్ అవుట్‌ అయ్యాడు. 27 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన మాథ్యూస్‌ను శాంట్నర్ అవుట్‌ చేశాడు. స్కోరు బోర్డుపై మరో మూడు పరుగులు చేరాయో లేదో ధనుంజయ డిసిల్వా కూడా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసిన డిసిల్వాను కూడా శాంట్నర్‌ బలి తీసుకున్నాడు. చమిక కరుణ రత్నే ఆరు పరుగులకు.. దుష్మంత చమీరు ఒక్క పరుగుకే వెనుదిరగడంతో 113 పరుగులకు లంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 150 పరుగుల్లోపు ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది.  కానీ మహీష్‌ థీక్షణ ఒంటరి పోరాటం చేశాడు. థీక్షణ చాలా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశాడు. 91 బంతులు ఎదుర్కొన్న థీక్షణ 39 పరుగులు చేయగా... మధుశంక  19 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి వికెట్‌కు విలుపైన 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో లంక  46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, టిమ్‌ సౌథీ 1, ఫెర్గ్యూసన్‌ 2, శాంట్నర్‌ 2 వికెట్లు తీశారు. 



 అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు అదిరే ఆరంభం దొరికింది. డేవిన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర తొలి వికెట్‌కు 12 ఓవర్లలోనే 86 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాదీ వేశారు. వీరి భాగస్వామ్యాన్ని చమీర విడదీశాడు. 42 బంతుల్లో 45 పరుగులు చేసిన కాన్వేను చమీరా అవుట్‌ చేశాడు. మరో రెండు పరుగులు స్కోరు బోర్డుపై చేరాయో లేదో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర కూడా అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత కాసేపు కివీస్‌ నెమ్మదిగా ఆడింది. కానీ 15 బంతుల్లో 14 పరుగులు చేసిన సారధి విలియమ్సన్‌ కూడా వెనుదిరగడంతో 130 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.  ఆ తర్వాత లేని సమన్వయ లోపం కారణంగా చాప్‌ మన్‌ రనౌట్‌ అయ్యాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేసిన డేరిల్‌ మిచెల్‌.... అసలంక పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో 162 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయింది. కానీ ఫిలిప్‌, లాథమ్‌ మ్యాచ్‌ను పూర్తి చేశారు. దీంతో 23.2 ఓవర్లలో 160 బంతులు మిగిలి ఉండగానే కివీస్‌ లక్ష్యాన్ని ఛేదించింది.