Revanth Reddy: తాను జైలు శిక్ష అనుభవించడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కారణమంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి (Palakurthy) నియోజకవర్గంలోని కాంగ్రెస్ విజయభేరి (Congress Vijayabheri) బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మంత్రి దయాకర్ రావు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలు వెళ్లడానికి దయాకర్ రావు కుట్ర చేశారని, శత్రువులతో చేతులు కలిపారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 


టీడీపీని దెబ్బతీయడం వెనుక ఎర్రబెల్లి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం వెనుక దయాకర్ రావు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలంతా కలిసివచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావును బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 2018 ఎన్నికల్లోనే ఊసరవెల్లి దయాకర్ రావును ఓడించాలనుకున్నానని అప్పుడు తన గురి తప్పిందన్నారు. ఇప్పుడు విజయవంతం అవుతుందని, దయాకర్ రావు ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్ల క్రితం డీలర్‌గా ఉన్న దయాకర్ రావు ఈ రోజు డాలర్ దయాకర్ రావు అయ్యారని ఆరోపించారు.


నమ్మక ద్రోహి దయాకర్ రావు
దయాకర్ రావు అనే వ్యక్తి నమ్మకద్రోహి, మిత్ర హ్రోహి అని నమ్మించి మోసం చేయడంలో ఎర్రబెల్లిని మించినోళ్లు ఎవ్వరూ లేరని రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులు, కుళ్లు కుతంత్రాలతో ఏమీ చేయలేరని విమర్శించారు. ఎర్రబెల్లి పాపం పండిందని, ఇన్నాళ్లు చేసిన మోసాలకు ప్రజలు సమాధానం చెప్పబోతున్నారని అన్నారు. కుట్రలు కుతంత్రాలతో గెలవాలని అనుకుంటున్నారని, అది సాగదన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, దయాకర్ రావు కుట్రలు, వెన్ను పోట్లు సాగవన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు బొంద పెట్టే సమయం ఆసన్నమైందన్నారు.


రూ.250 కోట్లు దోచుకున్నారు
ఉమ్మడి వరంగల్ జిల్లాను దయాకర్ రావు 40 ఏళ్లుగా నియంతలా ఏలుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటుంటే పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నన దయాకర్ రావు ఏ రోజు స్పందించలేదని మండిపడ్డారు. రూ.350 కోట్లతో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభించిన రిజర్వాయర్ అంచనాలను రూ.700 కోట్లకు పెంచి 250 కోట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకున్నారని ఆరోపించారు. 


వరంగల్‌కు పట్టిన శని ఎర్రబెల్లి
ఉమ్మడి వరంగల్‌కు పట్టిన శని దయాకర్ రావు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన్ను ఓడించాలంటే ప్రజలందరూ కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలకు తాను మాట ఇస్తున్నానని, కేసులు పెట్టినా, వేధించినా తాను అండగా ఉంటానన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తామన్నారు. కార్యకర్తలను వేధిస్తున్న దయాకర్ రావు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.


కాంగ్రెస్‌ను గెలిపించండి
ప్రజల మధ్యలో ఉంటూ, వారికి సేవ చేసేందుకు ఝాన్నీ రెడ్డి వస్తే, ఆమెకు పౌరసత్వం రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం తన కోడలిని అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ప్రజలను తన కుటుంబం అనుకున్నారని, వారిని కాపాడు కోవడం కోసం తన కోడలిని ఎన్నికల్లో నిలబెట్టారని చెప్పారు. పాలకుర్తి ప్రజలు ఆలోచించాలని, ఈ ఎన్నికలు, పదవులు వారి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురావని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.