అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు జీవితా రాజశేఖర్. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టడానికి తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. తప్పులు చేయడం మానవ సహజమని.. వాటిని మేం సరిదిద్దుకున్నామని అన్నారు. సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశామని చెప్పారు. ఎవరు ఏ ప్యానెల్ లో ఉంటారనేది వాళ్ల ఇష్టమని అన్నారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు గారికి కూడా చెప్పానని స్పష్టం చేశారు. 

 


 

బండ్ల గణేష్ తనపై ఆరోపణలు చేశారు కాబట్టే ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. పృథ్వీ కూడా తనపై ఈసీకి ఫిర్యాదు చేశారని.. ఆయన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని నవ్వారు. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని.. మంచి చేయడమే నా తప్పా..? అని ప్రశ్నించారు. గతంలో 'మా' ఎన్నికల్లో పాల్గొనాలని నరేష్ గారే తనను అడిగారని.. ఆయన చెప్పిన మాటలు విని ఎన్నికల్లో పోటీ చేశామని అన్నారు. 

 

ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టామని.. నరేష్ కి మద్దతుగా నిలిచామని గుర్తుచేసుకురు. అయితే ఈ ఆరోపణలన్నీ ఎన్నికలు వరకు మాత్రమే పరిమితం చేయాలని నరేష్ కి రాజశేఖర్ గారు సూచించారని.. ఆయన కూడా సరే అని అన్నారని..కానీ విషయంలోనే మాకు నరేష్ కి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. 'మా' డైరీ విడుదల సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో మీరంతా చూసే ఉంటారని జీవిత అన్నారు. అప్పటినుంచే తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. 'మా' కోసం నరేష్ ఎలాంటి పనులు చేయదని తను ఎక్కడా చెప్పలేదని జీవిత క్లారిటీ ఇచ్చారు.