చాలా కాలం తర్వాత ‘పఠాన్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్ ఖాన్, అదే జోష్ లో ‘జవాన్’ మూవీ చేస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరవనున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్, నయనతార, అట్లీ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.

  


జవాన్’ సినిమా వీడియో క్లిప్స్ లీక్


షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘జవాన్’ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. వీటిలో ఒక వీడియోలో షారూఖ్ ఖాన్ ఫైట్ సీన్లు చేస్తున్నట్లు ఉండగా, మరో వీడియోలో నయనతారతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన షారుఖ్ ఖాన్


తాజాగా ఈ అంశంపై షారుఖ్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. లీక్ అయిన వీడియో క్లిప్‌లు సినిమాకు ఇబ్బంది కలిగిస్తాయని పిటిషన్ లో పేర్కొన్నారు. లీక్ అయిన వీడియో క్లిప్‌ల కారణంగా హీరో, హీరోయిన్ల లుక్, మ్యూజిక్ ను బయటకు వెల్లడించేలా ఉన్నాయని తెలిపారు. సినిమా ప్రమోషన్ కు ఈ లీక్ అయిన క్లిప్స్ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అందుకే ‘జవాన్’కు సంబంధించిన వీడియో కంటెంట్ నెట్టింట్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుకు వేడుకున్నారు.


కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం


ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.  ‘జవాన్’ మూవీకి సంబంధించి కంటెంట్ ను వెబ్‌సైట్‌లు, కేబుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లు, డైరెక్ట్ టు హోమ్ సర్వీస్‌లతో సహా ఎలాంటి స్ట్రీమిండ్ ప్లాట్‌ఫారమ్‌ లు ప్రసారం చేయకూడదని ఆదేశించింది.  అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన  వైరల్ వీడియో క్లిప్‌లను తొలగించాలని యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్,  రెడ్డిట్ సహా పలు  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోర్టు ఆదేశించింది. ‘జవాన్’ కు సంబంధించిన కాపీరైట్ కంటెంట్‌ను ప్రదర్శించే లేదా డౌన్‌లోడ్ చేయడానికి అనుమతించే వెబ్‌సైట్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని వివిధ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను  ఆదేశించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.






Read Also: దక్షిణాది దండయాత్ర - 2022లో కోట్లు కొల్లగట్టిన సౌత్ సినిమాలు, ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!