తన పరువుకు భంగం కలిగించేలా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో అబద్దాలు చెప్పిందంటూ గీత రచయిత, కవి జావేద్ అక్తర్ కోర్టులో పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. 2020 నుంచి ఈ కేసు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందో కోర్టుకు వివరించారు జావేద్. 2016లో కంగనా, హృతిక్ రోషన్‌తో బహిరంగంగా గొడవ జరిగిందని, ఈ సందర్భంగా ఆమెకు కొన్ని సలహాలు ఇవ్వాలని తన ఇంటికి పిలిచానని చెప్పారు. ఇద్దరు కావాల్సిన వ్యక్తులు కావడంతో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశానన్నారు. కానీ, ఓ టీవీ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ ఆమెను నేను బెదిరించానని చెప్పడం బాధ కలిగించిందన్నారు. అందుకే, ఆమెపై పరువు నష్టం దావా వేసినట్లు వెల్లడించారు.   


జావేద్ కోర్టుకు చెప్పిన విషయాలు ఏంటంటే?


జావేద్ అక్తర్, కంగనా రనౌత్ పై వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విచారణ తాజాగా సబర్బన్ ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా జావేద్ కంగనాతో మీటింగ్ సందర్భంగా జరిగిన విషయాలను కోర్టుకు చెప్పారు. “కంగనాకు హృతిక్ రోషన్‌తో ఉన్న గొడవ గురించి ఏమి చేయాలో వారి కామన్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్ అగర్వాల్ సలహా ఇవ్వాలనుకున్నారు. హృతిక్‌తో కొనసాగుతున్న వివాదాలతో కంగనాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే, కంగనాను ఆమెతో సన్నిహితంగా మెలిగిన డాక్టర్ అగర్వాల్ పిలిచారు.  అక్క రంగోలీతో కలిసి మా ఇంటికి వచ్చింది. ఈ మీటింగ్ లో నా మాటలకు తను చాలా భయపడినట్లు చెప్పడం నిజం కాదు. వాస్తవానికి తను మా ఇంటికి రాక ముందే ఫోన్ లో ఏ విషయాల గురించి మాట్లాడాలో ముందే చెప్పాను.  వాతావరణం, రాజకీయ పరిస్థితులు,  2016లో అమెరికా ఎన్నికల గురించి చర్చించడానికి ఆమెను పిలవలేదు. తనకు వ్యక్తిగతంగా కంగనా తెలియకపోయినప్పటికీ, నటిగా తనకు ఎప్పటి నుంచో తెలుసు. అయితే, ఆమె తన మాట వినడం లేదని గ్రహించిన తర్వాత సమావేశంలో టాపిక్ మార్చాను. నేను సర్దుకుపోవాలని చెప్పినా తను వినకుండా వెళ్లిపోయింది” అన్నారు. 


ఇంటర్వ్యూలో కంగనా ఏం చెప్పిందంటే?


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం 2020లో ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా కీలక విషయాలు వెల్లడించింది. “హృతిక్ రోషన్‌ తో జరిగిన గొడవ విషయంలో  నన్ను హృతిక్ కు క్షమాపణలు చెప్పమని అక్తర్ బెదిరించారు. ఒకసారి  ఆయన నన్ను తన ఇంటికి పిలిచి, రాకేష్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి), అతడి కుటుంబం చాలా మర్యాద కలిగిన కుటుంబం, మీరు వారికి క్షమాపణ చెప్పకపోతే, మీరు ఎక్కడికీ వెళ్ళలేరు. వారు మిమ్మల్ని జైలులో పెడతారు, చివరికి, మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు ఆత్మహత్య చేసుకుంటారు అని బెదిరించారు. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది” అని కంగనా వెల్లడించింది. ఈ ఘటన 2016లో జరగగా, 2020లో కంగనా ఓ ఇంటర్వ్యూలో  ఈ విషయాన్ని ప్రస్తావించింది. అదే సమయంలో జావేద్ ఆమెపై   పరువు నష్ట దావా వేశారు.   


Read Also: అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ‘AAA సినిమాస్’లోని ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?