Janhvi Kapoor About Devara: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర‘ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. తాజాగా ‘కాఫీ విత్ కరణ్‘ షోలో తన చెల్లి ఖుషీ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ, ‘దేవర‘ సెట్ లో అనుభవాల గురించి చెప్పింది.
అమ్మ, నేను సేమ్, కానీ- జాన్వీ కపూర్
‘దేవర‘ షూటింగ్ చాలా సరదగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. తన తల్లి శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు హిందీ వచ్చేది కాదని చెప్పింది. ఇప్పుడు తెలుగు రాకుండానే తాను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పింది. “మా అమ్మ శ్రీదేవికి, నాకు ఓ కామన్ పాయింట్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కూడా. హిందీ సినిమాలు చేయడం మొదలు పెట్టినప్పుడు, ఆమెకు హిందీ సరిగా వచ్చేది కాదు. అందరు ఆమెను ‘చిలుక’ అని పిలిచేవారు. ఇప్పుడు నేను తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు తెలుగు తెలియదు. తమిళం మాత్రమే వచ్చు. నేను సెట్ లో నా డైలాగులను రికార్డు చేసుకుంటాను. అందుకని మా డీఓపీ రత్నవేలు సర్ నన్ను ‘టేప్ రికార్డర్’ అని పిలుస్తూ ఆటపట్టిస్తున్నారు. ‘దేవర’ సెట్ లో అందరం ఓ కుటంబ సభ్యుల్లా ఉండటం సంతోషం కలిగిస్తోంది” అని చెప్పుకొచ్చింది.
సంపూర్ణ నటిగా కనిపించబోతున్నా- జాన్వీ
ఇక ‘దేవర’ సినిమా తనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుందని జాన్వీ వెల్లడించింది. తన కెరీర్ లో తొలి రెండు సంవత్సరాలు తలలేని కోడి మాదిరిగా గడిచిపోయాయన్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు తనకు ఓ వర్క్ షాప్ లా పనికి వచ్చాయని చెప్పింది. “నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ‘దేవర’ సినిమా మరోఎత్తు. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు ఓ వర్క్ షాప్ లా పనికి వచ్చాయి. ఈ సినిమాలో డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ సినిమాతో నాలోని నటిని పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ఈ సినిమా అనుభవాలను బేస్ చేసుకుని నా సినీ కెరీర్ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తాను” అని తెలిపింది.
ఏప్రిల్ 5న ‘దేవర 1’ విడుదల
ఇక 'ధడక్' సినిమాతో సినీ అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్, ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిలీ' లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ సినిమా చేస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను జనవరి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Read Also: ఆమాట విని తారక్ సీరియస్ అయ్యారు, రామ్ చరణ్ బ్రేక్ తీసుకుందాం అన్నారు - రాజీవ్ కనకాల