విజయదశమి పూజ కోసం రామా, జానకి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. అందరూ కలిసి గుడికి బయల్దేరడానికి సిద్ధం అవుతుంటే విష్ణు, మల్లిక వస్తారు. గుడిలో అమ్మవారికి పొంగలి ప్రసాదం వండి పెట్టాలి కదా అందుకు సంబంధించిన సామగ్రి విడిగా తెచ్చుకుంటున్నా అని చెప్తుంది. రేపటి నుంచి ఎటు వేరు కాపురం కదా పండగ రోజు కూడా మొదలు పెడితే మంచిదని అంటుంది. పండగ పూట కూడా ఎందుకు వేరుగా ప్రసాదం చేయడం రేపు అందరం కూర్చుని మాట్లాడుకుంటాం కదా అని జానకి అంటే నిన్ననే మాట్లాడుకున్నాం కదా ఇక వాటాల గురించి తప్ప మాట్లాడుకోవడానికి ఏమి లేదని మల్లిక పుల్ల విరిచినట్టు చెప్పేస్తుంది. జానకి ఏదో మాట్లాడబోతుంటే జ్ఞానంబ ఆపేస్తుంది. అన్నీ విషయాల్లో వేరు చేస్తూ ఉంటుంది మల్లిక. జెస్సి వాళ్ళని కారులో రమ్మని జానకి చెప్తుంది. అఖిల్ మాత్రం మనం కూడా రేపటి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి వేరుగానే ఉండాలి కదా అని చెప్తాడు. అలా గుడికి అందరూ కలిసి కాకుండా వేరు వేరుగా వెళ్లిపోతారు.


Also Read: పాపం తులసి పప్పులు ఉడకలేదు- నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా భయపడేదేలే అని విజృంభించిన లాస్య


కొడుకులు చేసిన పనికి జ్ఞానంబ కన్నీళ్లతో కూలబడిపోతుంది. గోవిందరాజులు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వేరు పడాలనే ప్రస్తావన వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. అలా జరగకుండా ఉంటే బాగుండు అని ఆరాటపడ్డాను. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన పని చూసిన తర్వాట నా ఆలోచన జరగదని అర్థం అయ్యింది. విడిపోవడానికి ఆవేశం ఉంటే సరిపోతుంది కానీ కలిసి ఉండటానికి ఓర్పు ఉండాలి సర్దుకుపోయే గుణం ఉండాలి. ఆ రెండు వాళ్ళకి లేవు.. ఇక బాధపడటం అనవసరం అని జ్ఞానంబకి నచ్చ చెప్పడానికి గోవిందరాజులు చూస్తాడు. చూశావా వాళ్ళు ఎలా చేశారో నా నిర్ణయం వెనక్కి తీసుకోమని ప్రాధేయ పడ్డారు కానీ వాళ్ళలో ఆ బాధ లేదు బంధాలని విడిచిపెట్టి స్వేచ్చగా ఉండటం కోసం ఆరాటపడుతున్నారు, ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసిందని జ్ఞానంబ రామాతో అంటుంది.


బాధపడకమ్మా వాళ్ళు మనసు మార్చుకుంటారులే అని రామా సర్ది చెప్తాడు. విజయదశమి పూజ అయ్యేలోపు అఖిల్, విష్ణు మనసు మార్చి కలిసి ఉండేలా చేయాలని జానకి మనసులో అనుకుంటుంది. జ్ఞానంబ వాళ్ళు గుడికి వస్తారు. మల్లిక గుడిలో నీలావతి కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ తనకి బదులుగా వేరే మనిషిని పంపిస్తుంది. గుడిలో చేయాల్సిన రచ్చ గురించి మల్లిక నీలావతి పంపించిన మనిషికి చెప్తుంది. మల్లిక నైవేద్యం చేసే టైమ్ కి జ్ఞానంబ కుటుంబం గుడికి వస్తుంది. అప్పుడే మల్లిక ఏర్పాటు చేసిన మనిషి వచ్చి మీది ఉమ్మడి కుటుంబం కదా నువ్వు ఒక్కదానివే ప్రసాదం చేస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. పరిస్థితులు పద్ధతులు మారుతూ ఉంటాయని మల్లిక అంటుంది.


Also Read: దేవిని తీసుకెళ్లిపోతానని తెగేసి చెప్పిన ఆదిత్య- గుండెలు పగిలేలా ఏడుస్తున్న రుక్మిణి


ఈ విజయదశమి నుంచి మేము అని మల్లిక చెప్పబోతుంటే జానకి అడ్డుపడుతుంది. సరదాకి కూడా ఒక హద్దు ఉంటుంది దాన్ని దాటకు అని చెప్తుంది. మల్లిక ఏదో చెప్పబోతుంటే నువ్వు అడ్డుపడుతున్నావ్ ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమి జరగలేదు మల్లిక కడుపుతో ఉంది కాబట్టి అత్తయ్యగారు స్వయంగా పొంగలి చేసి పెట్టమని చెప్పారు అని జానకి చెప్తుంది. ఏడేదో ఊహించుకుని అనవసరంగా మాట్లాడకండి అని గడ్డి పెడుతుంది. కుటుంబం వేరు పడటం అంటే వాళ్ళ పరువుని బజారున పెట్టడం కాదు అత్తయ్యగారు ఆవిడ నిర్ణయాన్ని చెప్పారు రేపు అత్తయ్యగారు డిసైడ్ చేస్తారు అప్పటి దాకా సైలెంట్ గా మాతో పాటు ఉండు అందరితో కలిసి పూజ చెయ్యి జానకి చెప్తుంది. అంటే మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా అని మల్లిక అంటుంటే జ్ఞానంబ అడ్డం పడి జానకి చెప్పినట్టు చెయ్యమని చెప్తుంది.