రామా మల్లిక వాళ్ళకి సర్ది చెప్పేందుకు చూస్తుంటే వద్దని వారిస్తుంది జ్ఞానంబ. రేపే విజయదశమి ఆ మరుసటి రోజు నుంచి ఎవరి వాటాలు వాళ్ళవి ఎవరి కాపురాలు వాళ్ళవి అని తేల్చి చెప్పేస్తుంది. ఆ మాటకి మల్లిక లోలోపల ఫుల్ ఖుషి అవుతుంది. గోవిందరాజులు నచ్చజెప్పడానికి చూస్తుంటే ఇందులో ఎటువంటి మార్పు లేదని ఖరాఖండిగా చెప్పేస్తుంది. అఖిల్ జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే మల్లిక వచ్చి బుర్ర చెడగొట్టేందుకు చూస్తుంది. నేను తొందరపడి అలా అనకుండా ఉండాల్సింది, అనవసరంగా ఆవేశపడ్డాను అని అఖిల్ అంటాడు. నువ్వేమి తొందరపడలేదు నీ పేరు అడ్డం పెట్టుకుని డబ్బు దాచుకోవడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. వేరు కాపురం పెట్టడం నీకు అన్నీ విధాలుగా మంచిదని చెప్తుంది. ఎలా మంచిది ఇప్పటి వరకు అందరితో కలిసి ఉన్నా ఇప్పుడు ఎలా బతుకుతాను అని అంటాడు.
Also read: పరంధామయ్య సర్ ప్రైజ్- తులసికి పూలతో ఘన స్వాగతం
విషయం ఇంత దాకా వస్తుంది కాబట్టి నలుగురికి నాలుగు వాటాలు ఆస్తి వస్తుంది. నీ వాటా తీసుకుని వ్యాపారం లేదా చదువుకోవచ్చని మల్లిక ఎక్కిస్తుంది. వేరు పడటం వల్ల నీకు చాలా లాభాలు ఉన్నాయని మల్లిక వాగుతుంటే జానకి విని అరుస్తుంది. ఎందుకు అభమం శుభం తెలియని అఖిల్ మనసు మార్చాలని చూస్తున్నావ్ అని జానకి కోప్పడుతుంది. మల్లిక మాటలు విని వేరు పడకు అని జానకి నచ్చజెప్పడానికి చూస్తుంది. చిన్న వదిన చెప్పినట్టు నేను కూడా వేరుగా ఉంటేనే ఎదగగలను అనిపిస్తుందని అఖిల్ చెప్తాడు. నీ ఆటలు ఇక సాగవు అన్నిటిలోనూ గెలుపు నాదే అని మల్లిక చిటిక వేసి మరి చెప్తుంది. జరుగుతున్న వాటిలో విష్ణు, అఖిల్ తప్పేమీ లేదు మల్లిక మాటలు విని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని జానకి మనసులో అనుకుంటుంది.
విష్ణు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మల్లిక మాటలకి ఆవేశపడి కుటుంబం విడిపోయే పరిస్థితికి తీసుకొచ్చాను అని విష్ణు ఫీల్ అవుతుంటే రామా వస్తాడు. అయ్యిందేదో అయిపోయింది నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, నువ్వు కావాలని అలా మాట్లాడలేదని నాకు తెలుసు. జరిగింది ఏది మనసులో పెట్టుకోకు మర్చిపో. కుటుంబం అంటే విడిపోయేది కాదని రామా సర్ది చెప్తాడు. ఎప్పటిలాగా కలిసి మెలిసి ఉందామని రామా చెప్తుంటే మల్లిక వస్తుంది. వద్దులే బావగారు మాకు ఇలాంటి మాటలు చెప్పి అత్తయ్యగారు ముందు పేరు కొట్టేస్తారు, మీకున్న తెలివితేటలు నా భర్తకి లేవుకాబట్టే పెద్ద వాళ్ళ ముందు మాకు చిల్లు పడుతుంది, మీ మాటలు వినే రోజులు పోయాయి అని అంటుంది. రామా అయినా మల్లికకి చెప్పేందుకు చూస్తాడు కానీ వినదు. కలిసి ఉంటే మల్లిక అన్నయ్య వాళ్ళకి ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటుంది, అదే విడిగా ఉంటే కనీసం అన్నయ్య వాళ్ళు అయినా సంతోషంగా ఉంటారని విష్ణు మనసులో అనుకుని మల్లిక చెప్పినట్టు వేరుగా ఉండటమే మంచిదని చెప్పేసి వెళ్ళిపోతాడు.
Also read: మాధవ్ కాలర్ పట్టుకుని నిలదీసిన రుక్మిణి- అక్క గురించి అపార్థం చేసుకుంటూనే ఉన్న సత్య
పిల్లలు ఆవేశపడ్డారని మనం ఎందుకు తొందరపడటం నీ నిర్ణయం గురించి ఒకసారి ఆలోచించమని గోవిందరాజులు చెప్తుంటే రామా, జానకి కూడా అదే విషయం గురించి మాట్లాడటానికి వస్తారు. తెలిసే తెలియకో వేరు కాపురం అని తొందరపడి మాట్లాడారు, వేరే కాపురం పెడితే వాళ్ళు బతకలేరు అని జానకి చెప్తుంది. ఇటు మల్లిక అటు జెస్సి కడుపుతో ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో వేరు కాపురం పెడితే చాలా ఇబ్బంది పడతారు, నెలలు నిండే కొద్ది వాళ్ళు చాలా కష్టపడతారని రామా, జానకి నచ్చజెప్పడానికి చూస్తారు. వేరు కాపురం పెట్టాలనే నిర్ణయం మార్చుకోమని రామా అడుగుతాడు. నేనేమీ ఆవేశపడి నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళకి బలంగా కోరిక ఉంది కాబట్టే ఆ మాట చెప్పాను. కలిసి ఉంటే వచ్చే లాభం తెలుసుకోవాల్సింది వాళ్ళే కానీ మన మాట వినే ఆలోచన వాళ్ళకి లేనప్పుడు ప్రాధేయపడటం అనవసరం. ఇప్పటి వరకి వాళ్ళ కోసం పడిన శ్రమ చాలు అలాంటి వాళ్ళ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని జ్ఞానంబ చెప్తుంది.