తప్పని పరిస్థితుల్లో కానిస్టేబుల్ అయ్యానని తన అసలు కల ఐపీఎస్ ఆఫీసర్ కావడమని జానకి చెప్పడం మనోహర్ వింటాడు. ఎంతో కష్టపడి ఐపీఎస్ పరీక్షలు రాశాను కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అవలేకపోయానని అంటుంది. తన ఐపీఎస్ కల నెరవేర్చుకునే వరకు నిద్రపోనని జానకి అంటే ఐపీఎస్ కల చేదిరిపోయేలా చేసే వరకు నిద్రపోనని మనోహర్ మనసులో అనుకుంటాడు. జెస్సి బిడ్డని తీసుకుని ఇంటికి వస్తుందని రామ ఇల్లంతా పూలతో అలంకరిస్తూ హంగామా చేస్తాడు. ఇంటికి వారసుడి వచ్చినందుకు జెస్సి, అఖిల్ కంటే రామనే ఎక్కువ సంతోషపడుతున్నాడని జ్ఞానంబ దంపతులు అనుకుంటారు. అది చూసి మళ్ళీ కుళ్ళుకుంటుంది.


Also Read: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య


జెస్సి, అఖిల్ తో తన అమ్మానాన్నలతో కలిసి ఇంటికి వస్తుంది. బాబు ఇంటికి వస్తున్నాడని పెద్దన్నయ్య హడావుడి చేస్తున్నాడని వెన్నెల అంటుంది. మంగళవాయిద్యాలతో హారతి ఇచ్చి బాబుకి ఆహ్వానం పలుకుతారు. మనవడిని ఇచ్చేసరికి కోడలి విలువ బంగారంలా పెరిగిపోయిందని మల్లిక తిట్టుకుంటుంది. అఖిల్ బిడ్డని ఎత్తుకుని తెగ మురిసిపోతాడు. రామ వచ్చి బాబుని ఎత్తుకోవాలని ఉందని అడుగుతాడు. కానీ అఖిల్ మాత్రం నువ్వు ఆ పని ఈ పని చేసి చేతులు మురికిగా ఉంటాయి వద్దు బాబు తండ్రిని నేను నా భయాలు నాకుంటాయి నీకు అర్థం కావులే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో రామ చాలా బాధపడతాడు. అది చూసి జ్ఞానంబ బాధపడుతుంది. అఖిల్ మాటలు తలుచుకుని బాధపడుతుంటే జానకి వస్తుంది. తన బాధ కనిపించకుండా కవర్ చేసుకుంటాడు.


జానకి వచ్చి బిడ్డని ఎత్తుకుని బయటకి తీసుకొస్తుంది. అది చూసి మేరీ జానకి మీద సీరియస్ అవుతుంది. ఈ ఇంట్లో మీ వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండవా, బాబుని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? మీ పెద్ద వదిన దురదృష్టజాతకురాలు. ఇంతవరకు ఆవిడ నెల తప్పలేదంటే ఏంటి అర్థం. బాబుని ఎత్తుకుంటే దిష్టి తగలడంతో పాటు ఆవిడ దురదృష్టం కూడా అంటుకుంటుందని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకి జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జ్ఞానంబ ఆ మాటలు కూడా వింటుంది. అదేంటి అప్పుడే తీసుకొచ్చావని జెస్సి అడుగుతుంది కానీ జానకి పనులున్నాయని అబద్ధం చెప్తుంది. రామ బాధపడుతుంటే జానకి తన దగ్గరకి వచ్చి బాబుని ఎత్తుకున్నారా అని అడుగుతుంది. రామ ఎత్తుకున్నానని అబద్ధం చెప్తాడు. అవన్నీ నిజమని జానకి నమ్మేస్తుంది. ఇద్దరూ ఒకరిబాధని మరొకరు బయటకి చెప్పుకోకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు.


Also Read: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి


జానకి మేరీ మాటలు గురించి ఆలోచిస్తూ ఉండగా జ్ఞానంబ వస్తుంది. సొంత తమ్ముడు అయి ఉండి అఖిల్ బాబుని రామకి ఇవ్వలేదు. తల్లిగా అఖిల్ ని మందలించొచ్చు కానీ వాడు మనసులో ద్వేషం పెంచుకుంటాడు. అందుకే చూస్తూ బాధపడటం తప్ప ఏమి చేయలేకపోయానని జ్ఞానంబ బాధపడుతుంది. రామ, నీది ఒకే లాంటి జీవితం. మీ ఇద్దరి లక్ష్యాలు, ఆశయాలు మంచివే కానీ వాటి గురించే తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోవడం లేదు ఎంత కాలం ఇలా అని జ్ఞానంబ అడుగుతుంది. లక్ష్యం చేరుకునేవరకని జానకి చెప్తుంది. లక్ష్యం చేరుకోవడం కోసం జీవితాన్ని ఖర్చుపెడతానంటే కుదరదు దాని విలువ మీకు ఇప్పుడు తెలియదు. భార్యగా మారడం అంటే భర్తతో పాటు అత్తింటి బాధ్యతలు తీసుకోవడం తల్లిగా మారడం పిల్లల బాధ్యతలు మోయడం అన్ని చూసుకోవాలి. లక్ష్యం కోసం ఇవేవీ వదులుకోకూడదు. పెళ్ళైనాక నీ జీవితం నీది మాత్రమే కాదు నీ భర్తది కూడా. తన ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకుని నడుచుకోవాలని సలహా ఇస్తుంది.