మల్లిక ఒకవైపు ఆనందపడుతూనే మరొక వైపు బాధపడుతుంది. ఏమైందని విష్ణు వింతగా అడుగుతాడు. మనం వేరే కాపురం పెట్టుకుందామని అంత కష్టపడితే చిన్న జైలులో నుంచి పెద్ద జైలులోకి తీసుకొచ్చి పడేసింది. కానీ మన జీవితాలు, జీతాలు మనవే అనేసరికి కాస్త బాగుంది, ఇంటి ఖర్చులు ఎవరివి ఎంత అని అడుగుతానని మల్లిక అంటుంది. వెళ్ళి మాట్లాడితే లేనిపోని సమస్యలు వస్తాయని విష్ణు అంటాడు. అత్తయ్యగారు ఇప్పుడేందుకు మనసు మార్చుకున్నారని మల్లిక అనుమానిస్తుంది. జ్ఞానంబ ఫ్యామిలీ ఫోటో చూసి బాధపడుతూ ఉండగా రామ వాళ్ళు వస్తారు.


రామ: ఇంతకాలం బాధపడింది పోయిన ఇంటిని సంపాదించింది అందరం కలిసి ఉండాలని. కానీ నువ్వు ఎందుకమ్మా అందరినీ విడిపొమ్మని శపిస్తున్నావ్


జ్ఞానంబ: కారణం లేకుండా ఏ నిర్ణయం తీసుకొను కదా


జానకి: మీరు ఏం చేసిన గొప్పగానే అనిపించేది కానీ మొదటి సారి మీరు చేసింది బాధగా అనిపిస్తుంది


రామ: అందరూ విడివిడిగా బతకండి అని అనడం చాలా బాధగా ఉంది


జ్ఞానంబ: నలుగురు బరువు నువ్వు ఒక్కడివే మోస్తుంటే మిగిలిన వాళ్ళకి ఆ బాధ తెలియదు, తెలియాలంటే చెప్తే వినే వయస్సు కాదు అందుకే ఎవరి బరువు వాళ్ళే మోయాలి నేను చేసింది అదే


Also Read: కనకం అక్క ఇంట్లో పెళ్లి చూపులు- రాహుల్ కోసం వెళ్ళిపోయిన స్వప్న


రామ: అందరం నీ పిల్లలమే కదా తమ్ముళ్లకి ఏమి తెలియదు


జానకి: దయచేసి అందరూ కలిసి ఉండేలా చూడండి


జ్ఞానంబ: విడిగా ఉన్నా ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా. నేను తీసుకుంది మంచి నిర్ణయం అని నాకు తెలుసు త్వరలో మీకు తెలుస్తుంది. కాపురాలు నిలబడాలి అంటే కొన్ని ఆలోచనలు మనసులో తీసేయాలి నేను చేస్తుంది అదే


జెస్సి సంతోషంగా ఉండటం చూసి అఖిల్ కోపంతో రగిలిపోతాడు. ‘వదిన రానంత వరకు నేను ఇంట్లో హీరోగా ఉన్నా ఇప్పుడు జీరో అయ్యాను నీతో పెళ్లి చేసి నా జీవితం నాశనం చేసిందని’ అఖిల్ జానకిని తిడతాడు. అందరం కలిసి ఉంటే బాగుంటుందని చేసిన దాంట్లో తప్పేముందని జెస్సి అంటుంది. జీతం రాగానే నన్ను డబ్బు అడిగితే రూపాయి కూడా ఇవ్వనని అఖిల్ అంటాడు. ఎప్పటిలాగా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు. అందరం కలిసి విడివిడిగా ఉండటం అనే మాట చాలా బాధగా ఉందని రామ బాధపడుతూ ఉంటే జానకి నచ్చజెప్పడానికి చూస్తుంది. అందరం విడివిడగా ఉన్నా ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా  అని రామాని నవ్వించడానికి చూస్తుంది.


Also Read: కేఫ్ మూయించేందుకు గాయత్రి కుట్ర- అత్తకి ఎదురు తిరిగి భార్య మనసు గెలుచుకున్న అభి


అందరం కలిసి భోజనం చేస్తూ ఉంటే బాగుందని వెన్నెల, జెస్సి సంతోషపడుతుంటే గోవిందరాజులు మల్లికని దెప్పి పొడిచేలా మాట్లాడతాడు. రేపు ఒక స్పెషల్ రోజు అనేసరికి జానకి అవును అత్తయ్యమావయ్య పెళ్లి రోజని చెప్తుంది. ఘనంగా చేద్దామని రామ అంటే వద్దని ఎప్పటిలాగా గుడికి వెళ్దామని చెప్తుంది. ఆ మాటకి రామ వాళ్ళు బాధపడతారు. జ్ఞానంబ మాటలకి గోవిందరాజులు కూడా బాధగా వెళ్ళిపోతాడు. తమ్ముళ్లని పిలిచి అమ్మానాన్న పెళ్లి రోజు చేయాలని అంటాడు. అమ్మ వద్దని చెప్పిన తర్వాత ఎందుకని అఖిల్ అంటాడు. సరే చేద్దాం తన వంతుగా ఐదు వేలు ఇస్తానని విష్ణు అనేస్తాడు. మల్లిక ఆపుతున్నా కూడా వినిపించుకోకుండా డబ్బులు ఇచ్చేస్తాడు. అఖిల్ కూడా ఐదు వేలు ఇస్తాడని జెస్సీ ఇరికించేస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తరవాత వెన్నెల జానకిని మెచ్చుకుంటుంది.