జ్ఞానంబ జానకికి అండగా నిలబడి మాట్లాడుతుంది. తనని బాధపడొద్దని ధైర్యం చెప్తుంది. ఆడదానికి ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. స్త్రీ ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని రాజ్యాలు ఏలినా మాతృత్వం సంతరించుకుంటేనే ఆ జన్మకి పరిపూర్ణత అర్థం చేసుకో అని సౌమ్యంగా చెప్తుంది. పోలేరమ్మ జానకిని తిడుతుంది అనుకుంటే ఇలా సపోర్ట్ చేసి మాట్లాడుతుందే నా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయ్యిందే అని మల్లిక ఏడుస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్యగారు పెద్ద కోడలిగా ఈ ఇంటి గౌరవం కాపాడాల్సిన నేను మీరు, రామాగారు మాట పడేలా చేశాను ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటానని జానకి చెప్తుంది.


జానకి మాత్రం అమ్మలక్కలు అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే రామా వస్తాడు. ఎందుకండీ బాధపడుతున్నారు అమ్మ మిమ్మల్ని ఏమి అనలేదు కదా అంటాడు. 'అదే నన్ను మరింత ఎక్కువగా బాధపెడుతుంది, ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అంటేనే తట్టుకోలేని అత్తయ్య గారు ఈరోజు నలుగురు సూటి పోటి మాటలు అంటుంటే మీలో ఏదో లోపం ఉంది అన్నప్పుడు అత్తయ్యగారి గుండె ఎంత నలిగిపోయిందే నేను అర్థం చేసుకోగలను. అయినా ఆ బాధని గుండెల్లో పెట్టుకుని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. మీరు ఎంత బాధ పడ్డారో కూడా నాకు అర్థం అవుతుందని' జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కానీ ఈ తప్పు మీది కాదు నాది అని రామా అంటాడు. ఇప్పుడు ఏమంటారు అమ్మ కోరిక ప్రకారం మనం కూడా పిల్లల్ని కనేద్దాం అంటారు అంతే కదా కనేద్దాం నెల తిరిగేలోపు అమ్మకి శుభ వార్త చెబుదాం, అనుకున్నదే ముహూర్తం అని అంటాడు. ఆ మాటకి జానకి ఆశ్చర్యపోతుంది. జానకిని దగ్గరకి తీసుకుంటాడు.


Also Read: యష్ ని ఘోరంగా అవమానించిన కొడుకు ఆదిత్య- తల్లడిల్లిన తండ్రి మనసు


‘ఒక్క క్షణం మనం నిగ్రహం కోల్పోతే తల్లిదండ్రులు కావడం చాలా సులభం, కానీ జానకి గారు అనుకున్నది సాధించి పిల్లల్ని కనే బాధ్యత అవకాశం ఎంత మందికి వస్తుంది చెప్పండి, మీరు ఐపీఎస్ అవడం మీ నాన్న గారి కల, మనకి పిల్లలు పుట్టడం అమ్మ కోరిక. మీ ఆశయం నెరవేరిన తర్వాత పైనున్న మీ నాన్నగారు సంతోషిస్తారు. పిల్లల్ని కంటే మా అమ్మ సంతోషిస్తుంది, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి చదువు మీద దృషి పెట్టమని చెప్తాడు. జానకి ఇంట్లో పనులు చేస్తూ ఉంటే గోవిందరాజులు వచ్చి చదువుకోకుండా ఈ పనులు చేస్తున్నావ్ ఏంటి వెళ్ళు అని అంటాడు. అప్పుడే మల్లిక వచ్చి వాగుతూ ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. మల్లిక అత్తయ్యగారి మాట ప్రకారం ఇలా చేస్తున్నా అని అరుస్తూ చెప్తుంటే అప్పుడే జ్ఞానంబ వచ్చి పిలుస్తుంది. ఇలాంటి పనులు నువ్వు చెయ్యకూడదు, బాగా తినాలి విశ్రాంతి తీసుకోవాలి, ఈ పనులన్నీ చెయ్యకు అని చెప్తుంది. నీకు పరీక్షలు ఉన్నాయని ఇంటి పనులకి దూరంగా ఉండమని చెప్పాను కానీ సమయాన్ని సర్దుబాటు చేసుకుని ఇంటి పనులు చూసుకో అని జ్ఞానంబ జానకికి చెప్తుంది.


జానకి పనులు చేస్తుందని చూసి మల్లిక డాన్స్ వేస్తూ కాలు జారి కింద పడిపోతుంది. వామ్మో నా నడుము విరిగిపోయిందని అరుస్తుంది. అసలు నువ్వు గర్భవతివేనా అని జానకి మల్లికని అడిగేస్తుంది. అదేంటి అలా అంటావ్ అని మల్లిక భయపడుతుంది. గర్భవతిగా ఉండే వాళ్ళు ఇలా అజాగ్రత్తగా ఉండరు నీలో ఆ భయం కనిపించడం లేదని జానకి అంటుంది. ఏమైంది ఏంటి ఆ అరుపులు అని జ్ఞానంబ వస్తుంది. మల్లిక కాలు జారి కింద పడిందని జానకి చెప్పేసరికి జ్ఞానంబ చీవాట్లు పెడుతుంది. కింద పడింది కదా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కి చూపిద్దామని జానకి సలహా ఇస్తుంది. అవును నువ్వు అన్నది నిజమే డాక్టర్ ని పిలిపించమని చెప్తుంది. వద్దులే అని మల్లిక చెప్పినా వినిపించుకోదు. ఇప్పుడు డాక్టర్ వచ్చి నన్ను టెస్ట్ చేస్తే తెలిసిపోతుందే అని మల్లిక భయపడుతుంది.


Also Read: రాధ, మాధవ్ ల సవాల్- రుక్మిణి ఈ ఇంటి దేవత అంటోన్న దేవుడమ్మ


డాక్టర్ వచ్చి మల్లికని పరిశీలిస్తుంటే గది బయట ఉన్న ఇంట్లో వాళ్ళు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మల్లిక డాక్టర్ కి డబ్బులు ఇవ్వబోతుంటే ఆమె కోపంగా బయటకి వస్తుంది. కడుపులో బిడ్డ బాగానే ఉంది కదా అని జ్ఞానంబ కంగారుగా అడుగుతుంది. మల్లిక కవర్ చేయబోతుంటే నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ కోపంగా అంటుంది. అది విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. తను కడుపుతో ఉన్నదన్న మాట అబద్ధం అని డాక్టర్ చెప్పేసరికి జ్ఞానంబ ఉగ్ర రూపం దాలుస్తుంది.