రజనీకాంత్ ‘జైలర్’ నుంచి అప్‌డేట్స్ మీద అప్‌డేట్స్ వస్తున్నాయి. ఆగస్టు 10వ తేదీన సినిమా రిలీజ్ కానుండటంతో టీమ్ ప్రమోషన్లపై బాగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘హుకుం’ అంటూ రానున్న ఈ పాటను జులై 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘కావాలా’కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.


ఇప్పుడు రిలీజ్ కానున్న రెండో పాట హీరోయిజంను ఎలివేట్ చేసేలా ఉండనుందని ప్రోమో చూసి చెప్పవచ్చు. ‘హుకుం.. .టైగర్‌కా హుకుం’ అని వాయిస్ ఓవర్, ముందు రజనీ, వెనక వందల్లో రౌడీలను చూస్తే ఇది ఇంట్రడక్షన్ సాంగ్ లేదా ఎలివేషన్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.


రజినీ కాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు. వీరితో పాటు హిందీ నటుడు జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, రమ్య కృష్ణ, తమన్నా,  వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మరిముత్తు, నమో నారాయణ, రిత్విక్, అనంత్, శరవణన్, అరంతాంగి నిషా, మహానటి శంకర్, కలై అరసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.


ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక జైలర్ మూవీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సెట్స్ లో  చిత్ర యూనిట్ తో కలిసి రజనీకాంత్ ఓ భారీ కేక్ ని కట్ చేస్తూ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ‘జైలర్’తో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లాల్ సలాం’ సినిమాలో కూడా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను రజనీకాంత్ పూర్తి చేశారు.


మరోవైపు రజనీకాంత్ తర్వాతి సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో విలన్‌గా ఎవరు నటిస్తున్నారనే దానిపై బోలెడన్ని లీకులు వస్తున్నాయి. చియాన్ విక్రమ్, అరవింద్ స్వామి, యాక్షన్ కింగ్ అర్జున్ ఇలా అనేక మంది నటుల పేర్లు వినిపిస్తున్నాయి.