తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ సహా విడుదలైన ప్రతి చోటా భారీగా కలెక్షన్లు రాబట్టింది. విదేశాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ‘జైలర్’ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
దర్శకుడికి బహుమతిగా లగ్జరీ కారు
‘జైలర్’ మూవీ సంచలన విజయంతో చిత్రబృందం ఆనందంతో మునిగిపోయింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పండించింది. అనుకున్న దానికంటే అద్భుతంగా రాణించడంతో ప్రముఖ నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ చిత్ర హీరో రజనీకాంత్ తో పాటు నిర్మాత నెల్సన్ దిలీప్ కుమార్ కు ఊహించని బహుమతులు అందించారు. దర్శకుడు దిలీప్ కుమార్ కు లాభాల్లో వాటాకు సంబంధించిన చెక్ తో పాటు లగ్జరీ (Porsche) కారును బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నిర్మాత నుంచి వచ్చిన ఊహించని బహుమతితో దర్శకుడు సంతోషంలో మునిగిపోతున్నారట.
కనీవినీ రెమ్యునరేషన్ అందుకున్న రజనీకాంత్
అంతకు ముందు ‘జైలర్’ హీరో రజనీకాంత్ కు లాభాల్లో వాటాతో పాటు లగ్జరీ కార్లను బహుమతిగా అందించారు కళానిధి మారన్. రజనీకాంత్ కు లాభాల్లో వాటాగా రూ.100 కోట్ల రూపాయల చెక్ ను అందజేశారు. చెక్‌తో పాటు లేటెస్ట్ BMW కారును బహుమతిగా ఇచ్చారు. ‘జైలర్’ కోసం రజనీ రూ. 110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, లాభాల్లో వాటాగా మరో రూ. 100 కోట్లు అందుకున్నారు. మొత్తంగా ఈ చిత్రానికి గాను రజనీ రూ.210 కోట్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు భారత్ ఇంత స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరో మరొకరు లేరని చెప్పుకోవచ్చు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందులో తమన్నా, జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటించడం బాగా కలిసి వచ్చింది. అనిరుధ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది.
Read Also: ఫుల్ స్వింగ్‌లో నేషనల్ క్రష్, పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళ్తున్న రష్మిక
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial