అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన సినిమా 'పుష్ప'. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. అయినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా రూ.11 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. ముందుగా ఈ కథను మహేష్ బాబు కోసం తయారు చేశారని.. ఆ తరువాత బన్నీ లైన్ లోకి వచ్చాడని సమాచారం. 


'రంగస్థలం' సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు దర్శకుడు సుకుమార్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ సడెన్ గా ప్రాజెక్ట్ చేతులు మారింది. దాంతో మహేష్ కోసం రాసుకున్న కథనే సుకుమార్.. అల్లు అర్జున్ తో తీశారని అందరూ అనుకున్నారు. 


ఇదే విషయమై తాజాగా సుకుమార్ ని ప్రశ్నించగా..'మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్న మాట నిజమే. ఆ కథకి, 'పుష్ప' కథకి చాలా తేడా ఉంది. ఈ కథలు వేరు అని చెప్పలేను అలా అని ఒకటే అని కూడా చెప్పలేను' అంటూ సమాధానం చెప్పారు సుకుమార్. నిజానికి 'పుష్ప' అనేది ఒక రా ఫిలిం. ఈ కథలో మహేష్ బాబుని ఊహించుకోలేం. మహేష్ బాబు గనుక ఈ సినిమాలో నటించి ఉంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ వేరేలా ఉండేది. మహేష్ కి చెప్పింది కూడా ఎర్రచందనం బ్యాక్ డ్రాపే కానీ బన్నీ వచ్చిన తరువాత బ్యాక్ డ్రాప్ అలానే ఉంచి పాత్ర తీరుని మార్చేశారు సుకుమార్.