పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కలిసి నిర్మాత దానయ్య ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఇందుకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారు. ప్రస్తుతం భారీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆయా సినిమాల షెడ్యూల్ విరామ సమయంలో దానయ్య సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. కానీ, ఈ సినిమాకు సంబంధించి తొలి నుంచి అడ్డంకులే ఏర్పడుతున్నాయి. ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాలు, మధ్య మధ్యలో కూడా డేట్స్ కేటాయించకపోవడంతో  ఇకపై ఈ ప్రాజెక్ట్ పట్ల తనకు ఆసక్తి లేదని దానయ్య చెప్పేసినట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న భారీ అడ్వాన్స్‌ ను కూడా తిరిగి దానయ్యకు ఇచ్చేశారట.


పీపుల్స్ మీడియా-ప్రభాస్ ప్రాజెక్టుకు ముందుకు కొనసాగేనా?


ప్రభాస్ సన్నిహితుడు వంశీతో కొత్త నిర్మాణ బృందం కోసం అన్వేషణ మొదలుపెట్టారట. చివరికి పీపుల్స్ మీడియాతో కలిసి ప్రాజెక్టును కొనసాగించేందుకు అభిషేక్ అగర్వాల్, ఆసియన్ సునీల్‌లను సంప్రదించారట. వారు కూడా ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్టును వారు తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు షూటింగ్ పూర్తయింది. కానీ, కొన్ని కారణాలతో ప్రభాస్ కొద్ది రోజులుగా షూటింగ్ లో పాల్గొనడం లేదు. తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై కూడా క్లారిటీ లేదట. అసలు ఉంటుందా? లేదా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోందట.


ప్రభాస్ కు అశ్వినీదత్ ఏం చెప్పారు?


ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’ విడుదల తేదీ ఇప్పటికే వెల్లడైంది. ఈ రెండు చిత్రాల విడుదలకు ముందే పీపుల్స్ మీడియా మూవీ పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై మారుతీ దర్శకత్వంలో హారర్ చిత్రం ప్రతిపాదనలో ఉంది. అయితే, ముందుగా మిగిలిన చిత్రాలను పూర్తి చేయాలని ‘ప్రాజెక్ట్ కె’ నిర్మాత అశ్వినీదత్ ప్రభాస్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమా 2024 సమ్మర్‌కు షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.


ప్రభాస్ ఆ ప్రాజెక్టు చేసే టైం ఉందా? 


ప్రస్తుతం ‘మైత్రి’ బ్యానర్ లో ప్రభాస్, హృతిక్ రోషన్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉంది.  నిర్మాత దిల్ రాజు సైతం ఓ సినిమా కోసం ప్రభాస్ కు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ మధ్యలో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది.  మొత్తం మీద, పీపుల్స్ మీడియా ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్ట్‌ల తో పోలిస్తే చిన్న ప్రాజెక్టులా కనిపిస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’, ‘ఆదిపురుష్’,  ‘సలార్’, మైత్రి బ్యానర్‌లో హిందీ చిత్రం, దిల్ రాజు మూవీ  మధ్యలో పీపుల్స్ మీడియా సినిమా షూటింగ్‌కు తగిన సమయం ఉంటుందా?  లేదా?  అనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.


Read Also: పవన్‌తో నటించే అవకాశం వచ్చినా చేయను - ప్రియాంక అంత మాట అనేసిందేంటి?