మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య'(Acharya) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. 


ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం బయటకొచ్చింది. 'గాడ్ ఫాదర్' మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. 


ఒరిజినల్ వెర్షన్ లో టోవినో థామస్ ఒక రోల్ ప్లే చేశారు. సినిమాకి ఆ పాత్ర హైలైట్ గా నిలిచింది. ఒక పొలిటికల్ సభలో అతడు ఇచ్చే స్పీచ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి పాత్రను రీమేక్ లో తీసేశారని సమాచారం. 'గాడ్ ఫాదర్' సినిమాలో సత్యదేవ్ ని ఆన్ బోర్డ్ చేసుకున్నప్పుడు టోవినో థామస్ పాత్ర కోసం తీసుకున్నారని ప్రేక్షకులు భావించారు. కానీ కాదని తెలుస్తోంది. బహుశా ఆ పాత్రను సీక్రెట్ గా ఉంచి ఉంటారని..  సినిమాలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఉంటుందని అభిమానులు అనుకున్నారు. 


కానీ ఏకంగా పాత్రనే తీసేసి షాకిస్తున్నారు దర్శకుడు. వేరే భాష నుంచి తెలుగులోకి రీమేక్ చేసినప్పుడు చిన్న చిన్న మార్పులు చేయడం సహజమే. కానీ కథలో మెయిన్ ఎలిమెంట్స్ ని తీసేస్తే.. అది సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. 


ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.