నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara) సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. తొలిరోజు ఆరున్నర కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4. కోట్లు వసూళ్లు రాబట్టింది. రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.12.37 కోట్లు సాధించినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో నాలుగు కోట్లు సాధిస్తే సరిపోతుంది. కానీ ఈ సినిమా జోరు చూస్తుంటే అంతకుమించి కలెక్షన్స్ రావడం ఖాయమనిపిస్తుంది.
ఈ బ్లాక్ బస్టర్ కథ ముందుగా రవితేజ దగ్గరకు వెళ్లిందట. నేరేషన్ విన్న తరువాత ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. రవితేజకి కథ నచ్చినప్పటికీ.. కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడనే భయం ఉందట. అలానే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం రిస్క్ అనిపించిందట. ఆ కారణంగానే 'బింబిసార' సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఇదివరకు కూడా రవితేజ చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. 'పోకిరి', 'పటాస్', 'ఊసరవెల్లి' లాంటి సినిమా కథలను ముందుగా రవితేజకి వినిపించారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో వేరే హీరోల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు 'బింబిసార' విషయంలో కూడా అలానే జరిగింది. ఫైనల్ గా దర్శకుడు వశిష్ట.. కళ్యాణ్ రామ్ ని సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ హిట్ గనుక రవితేజకి పడి ఉంటే వేరేలా ఉండేది. 'క్రాక్' తరువాత ఇప్పటివరకు రవితేజ మరో హిట్ కొట్టలేకపోయారు. రీసెంట్ గా విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో 'టైగర్ నాగేశ్వరావు', 'ధమాకా', 'రావణాసుర' సినిమాలు ఉన్నాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా రవితేజ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!
ఇక 'బింబిసార' సినిమా విషయానికొస్తే.. ఇందులో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె ఈ సినిమాను నిర్మించారు.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!
Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!