స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’కు మంచి టీఆర్పీ రేటింగ్ కూడా లభిస్తోంది. ఈ షోకు వస్తున్న ఆధరణ దృష్టిలో పెట్టుకుని త్వరలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటీటీలో ‘బిగ్ బాస్’ షోను 24x7 ప్రసారం చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా దక్షిణాది భాషల్లో తొలిసారిగా ‘బిగ్ బాస్’ తెలుగు ఓటీటీ సీజన్ స్ట్రీమింగ్‌కు సన్నహాలు చేస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఈ షోను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని ప్రభావం ఇప్పుడు ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్‌పై కూడా పడే అవకాశాలున్నాయి. 


ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘బిగ్ బాస్’ వంటి భారీ రియాల్టీ షోను నిర్వహించడం పెద్ద సవాలే. ఎందుకంటే.. బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే కంటెస్టెంట్లను కనీసం 10 నుంచి 14 రోజులు ఐసొలేషన్‌లో ఉంచాలి. వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా.. ఇబ్బందే. వారి స్థానంలో మరో కంటెస్టెంట్‌ను ఎంపిక చేసుకుని మళ్లీ క్వారంటైన్లో ఉంచాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మరెవ్వరికైనా కరోనా వస్తే.. అల్లకల్లోలమవుతుంది. దీంతో ‘బిగ్ బాస్’ ఓటీటీ నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. 


వాయిదా పడుతుందా?: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘బిగ్ బాస్ ఓటీటీ’ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఫిబ్రవరి నెలకు కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ వంటి షోను నిర్వహించడం రిస్క్ మాత్రమే కాకుండా విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది. గత రెగ్యులర్ సీజన్స్‌పై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ముఖ్యంగా ‘బిగ్ బాస్ సీజన్-4’ ఎంతో టెన్షన్‌తో పూర్తిచేశారు. ఆ షో సక్సెస్ ఉత్సాహంతో సీజన్-5 కూడా విజయవంతంగా నిర్వహించారు. హిందీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్-ఓటీటీ’ స్ఫూర్తితో తెలుగు షోను ప్లా్న్ చేస్తున్నారు. 


Also Read: బిగ్ బాస్-ఓటీటీ 49 రోజులే.. టాప్-5 కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్! ప్రైజ్ మనీ.. ఫుల్ డిటైల్స్..


కంటెస్టెంట్ల ఎంపిక మొదలైందా?: ‘బిగ్ బాస్’ ఓటీటీని వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్ల జాబితా తయారు చేసినట్లు సమాచారం. అనివార్య కారణాల వల్ల ‘బిగ్ బాస్’ సీజన్-5లోకి వెళ్లలేకపోయిన యాంకర్ వర్షిణీ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. సీజన్-5లో ఆకట్టుకున్న యూట్యూబర్, నటి సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్ పేరు కూడా వినిపిస్తోంది. 12 లేదా 13 మంది కంటెస్టెంట్లతో ప్రారంభయమయ్యే ఈ ఓటీటీ సీజన్‌లో టాప్-5లో నిలిచే కంటెస్టెంట్లకు ‘బిగ్ బాస్’ సీజన్-6లో అవకాశం లభిస్తుందని సమాచారం. ఒకవేళ ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్‌కు ఏమైనా అవాంతరాలు ఏర్పడితే.. నేరుగా ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ‘బిగ్ బాస్’ సీజన్-6 తప్పకుండా జూన్ నెలలో ప్రారంభించాలి. కాబట్టి.. ఓటీటీ సీజన్‌ను తప్పకుండా ఫిబ్రవరిలో మొదలుపెట్టి.. మార్చి నెలాఖరికల్లా ముగించాలి. ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి సీజన్-6 ప్రారంభించాలనేది ‘బిగ్ బాస్’ నిర్మాతల ప్లాన్. మరి, ఏం జరుగుతుందో చూడాలి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి