1980వ దశకంలో సినీ ఇండస్ట్రీలో మెరిసిన తారలు మళ్ళీ కలిశారు. ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటులు కలయిక ఎప్పట్నుంచో సాంప్రదాయంగా వస్తోంది. తమ దశబ్దాల నాటి స్నేహాన్ని, అలాగే ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ రీ యూనియన్ లో దక్షిణాది నుంచి తారలు తరలి వస్తారు. ఇటీవల బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్ మరియు పూనమ్ ధిల్లాన్ హోస్ట్ చేసిన ఈ 11వ రీ యూనియన్ ముంబై లో ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణాది నుంచి దాదాపు 25 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. 


మహారాష్ట్ర సాంప్రదాయంలో :
 
ఈసారి రీ యూనియన్ ను ముంబై లో ఏర్పాటు చేయడంతో మహారాష్ట్ర సంప్రాదాయాలను పాటించారు. మహారాష్ట్రలో స్థానిక రుచులతో వంటకాలను తయారు చేశారు. వేదిక వద్ద జరిగిన ఈ రీయూనియన్‌లో దక్షిణాది కు చెందిన అనేక మంది నటీనటులు కలిసి మాట్లాడుకున్నారు. ఆనాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూనమ్ ధిల్లాన్ రూపొందించిన కొన్ని సరదా గేమ్‌లు, క్విజ్‌ పోటీలలో కూడా నటీ నటులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది నుంచి చిరంజీవి, శరత్‌కుమార్, భాగ్యరాజ్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ, మధుతో సహా హిందీ సినీ రంగానికి చెందిన నటీనటులు పాల్గొన్నారు. ఈసారి కొత్త థీమ్ దుస్తుల్లో తారలు మెరిశారు. నటీమణులు వెండి, నారింజ రంగుల్లో తళుక్కుమనగా, నటులు నారింజ, బూడిద రంగుల దుస్తుల్లో కనిపించారు. 


2009 నుంచీ ఈ సాంప్రదాయం:


ఎనభైల నాటి తారలంతా ప్రతీ ఏటా ఆత్మీయ కలయిక వేడుక జరుపుకోవాలనే కాన్సెప్ట్ ను సుహాసిని మణిరత్నం మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా 2009 నుంచి ఈ ఆత్మీయ కలయిక వేడుక నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ కలయిక చివరిసారిగా 2019 లో మెగాస్టార్ చిరంజీవి నివాసం వేదికగా జరిగింది. ఆ వేడుక లో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ కూడా హాజరయ్యారు. తర్వాత కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో 2020, 21 లలో ఈ ఆత్మీయ కలయికకు సందర్భం రాలేదు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో   11వ రీ యూనియన్ కు ఏర్పాట్లు చేశారు తారలు. 






ఈ సందర్భంగా తారలు ప్రస్తుతం సినిమాల పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వేడుక జరుపుకోవడానికి చాలా కారణాలున్నాయని పలువురు తారలు అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, బాక్సాఫీస్ వద్ద సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయని అన్నారు. ఇది సినిమా శక్తిని పునరుజ్జీవింపజేసి జరుపుకోవాల్సిన సమయం అని నటీనటులు అన్నారు. చాలా రోజుల తర్వాత జరిగిన ఈ కలయిక వేడుకలో తారలు ఎంతో ఉల్లాసంగా గడిపారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.


Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?