పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అందులో హనుమ విహారి(Hanuma vihari)ఒకరు. పవన్ మీద తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటి చెబుతుంటారు ఈ యంగ్ క్రికెటర్. తన కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. సినీ రంగంపై ఓ కన్నేసే ఉంచుతారు.
మొన్నామధ్య బిగ్ బాస్ షో గురించి కూడా మాట్లాడారు. అభిజిత్ ఆటతీరుపై కామెంట్ చేశారు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం అందించిన ఈ కుర్ర క్రికెటర్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు. కాకినాడకు చెందిన హనుమ విహారి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. గతంలో పవన్ తో దిగిన ఫోటోలను షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లను ఆడబోతున్న హనుమ విహారి ప్రస్తుతం తన టీమ్ తో కలిసి అక్కడే ఉన్నారు.
మ్యాచ్ ప్రాక్టీస్ తో ఎంత బిజీగా ఉన్నా.. పవన్ పై అభిమానాన్ని మాత్రం చాటుకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్-రానా సినిమాకి సంబందించిన మేకింగ్ వీడియోను వదిలారు. ఇందులో భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారో చూపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ అప్డేట్ చూసిన హనుమ విహారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. 'భీమ్లా నాయక్ ఆన్ ఫైర్' అన్నట్లుగా పోస్ట్ పెట్టారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళ వెర్షన్ లో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రల్లో తెలుగులో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. రానా భార్య పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాజేష్ ను ఎంపిక చేసుకున్నారు. సినిమాలో మరో ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ, క్యామియో రోల్ లో దర్శకుడు వి.వి.వినాయక్ కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.