India vs Japan Hockey Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 సెమీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు 5-0తో జపాన్‌ను ఓడించింది. ఇప్పుడు భారత్ ఫైనల్‌లో మలేషియాతో తలపడనుంది. సెమీఫైనల్‌లో భారత జట్టు ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 3-0తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత ద్వితీయార్థంలో కూడా రెండు గోల్స్‌ చేసింది. దీంతో మ్యాచ్‌ను 5-0 భారీ తేడాతో గెలుచుకుంది.


మొదటి నుంచి ఆధిపత్యం
టోర్నీ మొదటి నుంచి భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీ ఫైనల్‌లోనూ ఏమాత్రం తగ్గలేదు. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఆ తర్వాత 19వ నిమిషంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ భారత్‌కు మొదటి గోల్ అందించారు. ఆ వెంటనే 23వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. అనంతరం మన్‌దీప్ సింగ్, సుమిత్, కార్తీ సెల్వం కూడా ఒక్కో గోల్ చేశారు.


అంతకుముందు రెండేళ్ల క్రితం ఢాకాలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ 5-3తో భారత్‌ను ఓడించింది. ఈసారి దానికి ప్రతీకారం తీర్చుకుంది టీమ్ ఇండియా. ఈ సెమీఫైనల్‌లో టీమిండియా చాలా దూకుడుగా ఆడింది. అదే సమయంలో జపాన్ జట్టు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది.


ఆగస్టు 3వ తేదీన జరిగిన మ్యాచ్‌లో చైనాను భారత్ ఘోరంగా ఓడించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత్‌ 7-2తో విజయం సాధించింది. దీని తర్వాత ఆగస్టు 4వ తేదీన జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఆగస్టు 6వ తేదీన మలేషియాపై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. భారత్ 5-0తో మలేషియాను ఓడించింది. ఆ తర్వాత కొరియా చేతిలో 3-2తో భారత్ ఓటమి చవి చూసింది.


అంతే కాకుండా టీం ఇండియా ఈ టోర్నమెంట్‌లో 4-0తో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత గోల్ కీపర్ శ్రీజేష్‌కి సెమీ ఫైనల్ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది. అతని కెరీర్‌లో ఇది 300వ మ్యాచ్. మ్యాచ్‌కు ముందు అతడికి సన్మానం కూడా చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial