తెలుగులో పూర్తిగా బైక్ రైడర్స్, వారి రోడ్డు ట్రిప్పుపైనే ఆధారపడి వచ్చిన సినిమాలు లేవు. ‘ఇదే మా కథ’ సినిమా ఆ  లోటును పూడ్చేస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. దీని ట్రైలర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంచ్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ట్రైలర్ ను పోస్టు చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్, తాన్యా హోప్ రైడర్లుగా కనిపించబోతున్నారు. అందరూ సాధారణంగానే ఉన్నా, సుమంత్ అశ్విన్ హెయిర్ స్టైల్ మాత్రం చాలా వెరైటీగా ఉంది.  దాన్ని చూస్తుంటే ఆయన క్యారెక్టర్ కూడా కాస్త వెరైటీగా ఉంటుందేమో అనిపిస్తుంది. 


ట్రైలర్ ‘మన కష్టానికి కారణం మనిషైతే ద్వేషిస్తాం, దేవుడైతే విధిరాత అనుకుంటాం, మన కోరికలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది’ అనే శ్రీకాంత్ డైలాగుతో మొదలవుతుంది. సుమంత్ క్యారెక్టర్ కాస్త అల్లరల్లరిగా చూపించారు. భూమిక క్యారెక్టర్ మాత్రం భర్త చాటు భార్యగా కనిపించి, తరువాత తండ్రి కోరిక తీర్చేందుకు బయలుదేరిన బైక్ రైడర్ గా చూపించారు. ఇక హీరోయిన్ తాన్యా హోప్ టామ్ బాయ్ లా నటించింది. శ్రీకాంత్ తన చిన్ననాటి ప్రేమను వెతుక్కోవడానికి లద్ధాక్ వెళుతున్నట్టు చెప్పాడు. ఈ నలుగురు బైక్ రైడర్లు లద్ధాక్ చేరాక ఏం చేశారు? అక్కడ వారి జీవితం ఎలా మారింది? అనేదే కథ. ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలోకి వస్తుంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దీన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అక్టోబర్ 2న తేలిపోతుంది. పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  గురు పవన్ దర్శకత్వం వహించారు.