Allu Arjun About His Father: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో నటనకుగాను ఏకంగా ‘జాతీయ ఉత్తమ నటుడి’ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ స్టార్ హీరో సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆకట్టుకుంటోంది.  


ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ఫన్నీ పోస్ట్


తాను నటించి తొలి సినిమాకే తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు అల్లు అర్జున్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో తన తండ్రి అల్లు అరవింత్ ‘విజేత’ సినిమా షీల్డ్ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘విజేత’ ఒకటి. అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా ఈ సినిమాతోనే వెండితెరపై అడుగు పెట్టాడు. ఈ సినిమాను దర్శకుడు ఎ కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఆ విషయాన్ని బన్నీ గుర్తు చేసుకున్నారు.


‘విజేత’ 100 రోజుల షీల్డ్ పట్టుకుని నిలబడ్డ తన తండ్రి ఫోటోలను షేర్ చేస్తూ.. “మా నాన్న నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు” అని రాసుకొచ్చారు. దానికి స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు. ‘విజేత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, ‘స్వాతిముత్యం’ సినిమాలోనూ నటించాడు. ఈ సినిమాలోనూ బాల నటుడిగా కనిపించాడు. చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమాలో బన్నీ కామియో రోల్ పోషించాడు. అప్పటికి ఆయన హీరోగా పరిచయం కాలేదు.


‘పుష్ప2’ షూటింగ్ లో బన్నీ బిజీ బిజీ


ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘పుష్ప’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో నటనకుగానూ ఆయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ కనీ వినీ ఎరుగని విజయం సాధించిన నేపథ్యంలో,  ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప2’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది.


‘పుష్ప 2’పై దేవిశ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన అల్లు అర్జున్‌ గంగమ్మ తల్లి పోస్టర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌ ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌  చెప్పడం, ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. అల్లు అర్జున్ నటన మరో లెవల్ లో ఉండబోతుందని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా అలరించబోతుందన్నారు. ఇంటర్వెల్‌ సీన్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుందన్నారు.  ‘పుష్ప 2’ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: నెగెటివిటీయే నయా ట్రెండ్, సందీప్ రెడ్డి సక్సెస్ మంత్ర ఇదే!