Rangabali: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఆయన చివరిగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో కనిపించారు. ‘ఛలో’ సినిమా తర్వాత నాగ శౌర్య కు సరైన హిట పడలేదనే చెప్పాలి. ఆయన తాజాగా నటించిన సినిమా ‘రంగబలి’. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్వకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ జులై 7 న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్ ను కూడా చాలా వినూత్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. అవన్నీ సక్సెస్ కావడంతో ‘రంగబలి’ సినిమా గురించి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో నాగశౌర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రంగబలి’ సినిమా గురించి అలాగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నేను సినిమా చూశాకే ప్రమోషన్స్ చేస్తాను: నాగ శౌర్య
‘రంగబలి’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ గురించి మాట్లాడారు నాగశౌర్య. మూవీ ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయని అన్నారు. తాను ప్రమోషన్స్ చేసే ముందు సినిమా మొత్తం చూస్తానని, అప్పుడే ప్రమోషన్స్ చేయాలా వద్దా అనేది చేస్తామని చెప్పారు. ఈ సినిమా బాగా వచ్చిందని అన్నారు. ఆ భరోసాతోనే ప్రమోషన్స్ బాగా చేయగలుగుతున్నామని చెప్పారు.
ఇది అన్ని సినిమాలకు పనిచేస్తుందని చెప్పలేను..
తాను చేసిన సినిమాలు అన్నీ ఇలా వర్క్ అవుట్ అవుతాయని అనుకోడానికి లేదన్నారు నాగశౌర్య. గతంలో తాను నటించిన కొన్ని సినిమాలను తాను చూడనుకూడాలేదని చెప్పారు. ఒక సినిమా పై దాదాపు వెయ్యి మంది పనిచేస్తారు. అందుకే సినిమా సరిగ్గా రాకపోయినా ఎవరిమీదా నిందలు మోపలేం. అన్ని సినిమాలకు మనం అనుకున్నట్టు జరగదు. అయితే ‘రంగబలి’ సినిమాకు అదృష్టవశాత్తూ అంతా కలసొచ్చిందని చెప్పారు.
దర్శకుడు పవన్ అనుకున్నది కరెక్ట్ గా చేశాడు..
‘రంగబలి’ సినిమా దర్శకుడు పవన్ బసంశెట్టి మంచి దర్శకుడు అని అన్నారు నాగశౌర్య. నటీనటులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించే వ్యక్తే మంచి దర్శకుడు అవుతాడని తాను నమ్ముతానని, అలాంటి దర్శకుడు పవన్ అని అన్నారు. ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడ్డాడని అన్నారు. ఇది మంచి స్క్రిప్ట్ అని అందుకే తాను కలుగజేసుకోలేదని అన్నారు. అయితే తన అనుభవం, దర్శకుడి విజన్ వల్ల ‘రంగబలి’ బాగా వచ్చిందన్నారు. రంగబలి అనేది సొంతూరు అంటే అభిమానం ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడి కథ అని చెప్పారు.
దర్శకుల విషయంలో అదే నమ్ముతాను..
తన కెరీర్ లో దాదాపు 18 మంది కొత్త దర్శకులతో పనిచేశానని అన్నారు నాగశౌర్య. అయితే ఆ సినిమాలలో కొన్ని అనుకున్నంత విజయాన్ని అందుకోకపోతే తన నిర్ణయం తప్పు అని కాదని అన్నారు. అయితే ఒక దర్శకుడితో అనుకున్నట్టు సినిమా రాకపోతే మరో విభిన్నమైన కథను ఎంచుకొని ముందుకు వెళ్లాల్సిందేన్నారు. సినిమా అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు.
అవన్నీ వృత్తిలో భాగమే..
ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను స్పృహ తప్పి పడిపోయానని, అంబులెన్స్ వచ్చిందని చాలా వార్తలు వచ్చాయన్నారు. అయితే సినిమా కోసం ఒక్కోసారి ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందని, అలాంటపుడు ఇలాంటివి జరగడం సహజమేనని అన్నారు. "నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి. ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ నటన, డాన్స్, యాక్షన్ అన్నీ చేస్తున్నారు. నేనూ ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఆ క్రమంలో కొన్నిఆరోగ్య సమస్యలు తెలెత్తుతాయి. మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే కదా అయినా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది" అని చెప్పారు నాగశౌర్య.
Also Read: దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరో - గుండు లుక్‌తో షాక్ - D50 అనౌన్స్‌మెంట్!