మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదానికి గురైయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా తీగల వంతెనపై రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆయన్ను వెంటనే దగ్గర్లో ఉన్న మెడికవర్ అనే ఆస్పత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్‌కు గురై అపస్మారక స్థితిలో ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఇవి వైరల్‌గా మారాయి.


సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై మాదాపూర్ సీఐ స్పందించారు. అతి వేగం కారణంగానే సాయి తేజ్ ప్రమాదానికి గురైనట్లుగా ఆయన చెప్పారు. ఆయనకు స్కానింగ్ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని సాయి తేజ్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా మాదాపూర్ సీఐ వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్‌కు కుడి కన్ను, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయని తెలిపారు. స్కానింగ్ చేయడం ద్వారా గాయాల తీవ్రత తెలిసే అవకాశం ఉందని చెప్పారు. శరీరంలో అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా అనేది స్కానింగ్ రిపోర్డులు వచ్చాక తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు.


స్పందించిన పవన్ కల్యాణ్
సాయి ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన మావయ్య పవన్ కల్యాణ్ హుటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి వచ్చారు. లోపల ఆయన్ను చూసి బయటికి వచ్చిన పవన్ కల్యాణ్‌ను విలేకరులు ప్రశ్నించగా.. వేరే ఆస్పత్రికి షిఫ్ట్ చేస్తున్నామని, ఇంకా సాయి తేజ్ అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు చెప్పేసి వెళ్లిపోయారు.


ప్రమాద సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ట్రంఫ్ బైక్ వాడారు. బైక్ నెంబరు టీఎస్ 07 జీజే 1258. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు మెడికవర్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో మెడికవర్ ఆస్పత్రి ప్రాంగణం రద్దీగా మారింది.


అపోలో ఆస్పత్రికి సాయి ధరమ్ తేజ్
‘‘ప్రమాద సమయంలో సాయి తేజ్ మద్యం సేవించలేదు. బైక్‌పై సాయి తేజ్ ఒక్కరే ఉన్నారు. ఆయన హెల్మెట్ పెట్టుకొనే ఉన్నారు. రోడ్డుపై మట్టి ఉండడంతో అక్కడ బైక్ స్కిడ్ అయినట్లుగా తెలుస్తోంది. సాయితేజ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.’’ అని మాదాపూర్ ఏసీపీ మీడియాతో వెల్లడించారు.


క్లావికల్ ఫ్రాక్చర్‌గా తేలిన స్కానింగ్ రిపోర్టు
సాయి ధరమ్ తేజ్‌కు చెస్ట్ స్కానింగ్ నిర్వహించగా Clavicle fracture అని డాక్టర్లు గుర్తించారు. అంటే ఛాతి, భుజానికి మధ్య ఉండే కనెక్టింగ్ ఎముక విరిగినట్లుగా స్కానింగ్ రిపోర్టులో వెల్లడైంది. దీంతోపాటు మరికొన్ని ఫ్రాక్చర్స్ కూడా ఉన్నట్లుగా వెల్లడించారు.


వెంటిలేటర్‌పై తేజ్.. 48 గంటలు అబ్జర్వేషన్: తేజ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు  స్పందిస్తూ.. ప్రస్తుతం తేజ్ వెంటి లేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు. తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 48 గంటలు ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు. అప్పటివరకు ఏవిషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఎందుకంటే బైకు మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా గాయం కావచ్చని, అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదని, కాలుకు దెబ్బ తగిలిందని మరో వైద్యుడు తెలిపారు. అయితే, ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆయన కోసం ప్రార్థిద్దామని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు.