చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటుడు తేజ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. అతడు నటించిన 'జాంబీ రెడ్డి' సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇటీవల తేజ నటించిన 'అద్భుతం' సినిమా ఓటీటీలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో తేజ మార్కెట్ రేంజ్ బాగా పెరిగిపోయింది. దీంతో అతడు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'హను-మాన్'పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 


సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి క్రేజీ డీల్ వచ్చినట్లు తెలుస్తోంది. 'జాంబీరెడ్డి' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో 'హను-మాన్' హిందీ డబ్బింగ్ హక్కులను రూ.5 కోట్లు చెల్లించి కొనుక్కుంది ఓ సంస్థ. అలానే జీ గ్రూప్ సంస్థ ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందట. దీనికోసం దాదాపుగా రూ.11 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. 


అంటే ఒక్క నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే ఈ సినిమా రూ.16 కోట్లు రాబట్టిందన్నమాట. ఒక కుర్ర హీరో సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమా కోసం తేజ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. 


పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రైమ్ షో బ్యానర్‌పై కే.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.