సినిమా పరిశ్రమలో కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా మిగులుతాయి. తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రాలు వందల కోట్ల రూపాయలు వసూళు చేసిన సందర్భాలు ఉన్నాయి. బడ్జెట్ ఎంత అనేదానికంటే కంటెంట్ లో దమ్ముంటే, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపడం ఖాయం. అలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను సాధించింది. దిగ్గజ మేకర్స్ ను సైతం అబ్బుర పరిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో? దాని కథ ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ అద్భుతం


1990వ దశకంలో హారర్, థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న సమయం అది. ఈ టైమ్ లో డేనియల్ మైరిక్, ఎడ్వార్డో సాంచేజ్ కలిసి ఓ సినిమాను తెరకెక్కించారు. దాని పేరు ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’.  సినిమా కథ ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రాజెక్టు పని మీద ఈ ముగ్గురు ఓ అటవీ ప్రాంతానికి వెళ్తారు. ఆ ముగ్గురు ఎమయ్యారో తెలియదు. వాళ్లు కనిపించకుండా పోయిన ఏడాదికి వారి కెమెరాలు దొరుకుతాయి. ఆ కెమెరాల్లో ఉన్న వీడియోల ద్వారా వారు ఏమయ్యారో తెలుస్తుంది. అదే సినిమా కథ. హీతర్ డేన్యూ, మైఖేల్ విలియమ్స్, జోషువా లియోనార్డ్  అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.    


రూ. 49 లక్షల బడ్జెట్, రూ. 2 వేల కోట్ల వసూళు  


‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ చిత్రాన్ని 1999 జనవరి 23న సండెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఆ తర్వాత  జూలై 14న న్యూయార్క్ లో విడుదల చేశారు. జూలై 30న అమెరికా అంతటా విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది.  రూ. 49 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుత ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసి హేమాహేమీ దర్శక నిర్మాతలే ఆశ్చర్యపోయారు. చక్కటి కథ ఉంటే ప్రేక్షకులు సినిమాలను అద్భుతంగా ఆదరిస్తారు అనేందుకు ఈ చిత్రం ఓ ఉదాహారణగా చెప్పుకోవచ్చు.


అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో..


ప్రస్తుతం ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. చూడని వాళ్లు చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.


Read Also: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు - ఆత్మహత్యలపై విజయ్ ఆంటోని ఏం మాట్లాడారంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial