హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్టీఆర్‌తోపాటు ‘RRR’లో నటించిన అలియా భట్ కు అవార్డులు పంపిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వచ్చే వారం వీరికి ఈ అవార్డులు అందిస్తామని తెలిపింది.






హెచ్‌సీఏపై జూ. ఎన్టీఆర్ అభిమానుల విమర్శలు


వాస్తవానికి హెచ్‌సీఏపై జూ.ఎన్టీఆర్ అభిమానులు కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నారు. ‘RRR’ మూవీకి  పలు విభాగాల్లో హెచ్‌సీఏ అవార్డులు ప్రకటించింది. అయితే, ఇందులో ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏపై ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు.  ఈ నేపథ్యంలో సదరు అవార్డు సంస్ధ దిగి వచ్చింది.  ఎన్టీఆర్‌కు అవార్డు ఇచ్చినట్లు వెల్లడించింది. త్వరలో ఆయనకు పంపిస్తామని  ట్వీట్టర్ ద్వారా తెలిపింది. “‘RRR’ చిత్రానికి గానూ ఎన్టీఆర్‌, అలియా భట్‌కు వచ్చేవారం ‘హెచ్‌సీఏ’ అవార్డులను పంపిస్తున్నాం’’ అని వెల్లడిస్తూ హెచ్‌సీఏ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, అలియాభట్ పేర్లతో ఉన్న ట్రోఫీల ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అవార్డు సంస్థ తప్పు సరిచేసుకున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.  


ఎన్టీఆర్ కు ఆహ్వానం అందించాం-హెచ్‌సీఏ   


హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'ది విమెన్ కింగ్', 'టాప్ గన్ మేవరిక్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ ‘RRR’ మూవీ ఏకంగా ఐదు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఈ అవార్డును అందుకోవడానికి రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ హాజరయ్యారు. కానీ, తన సోదరుడు తారకరత్న చనిపోవడంతో ఎన్టీఆర్‌ వెళ్లలేదు. అయితే, ఈ సినిమాకు గాను చరణ్ కు అవార్డు ఇచ్చిన సంస్థ తారక్ పేరు ప్రస్తావించలేదు. అప్పటి నుంచి హెచ్‌సీఏ అవార్డు నిర్వహకులపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోపంతో ఊగిపోతున్నారు. చరణ్ కు ఇచ్చాక తమ హీరోకు ఎందుకు అవార్డు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. దీంతో హెచ్‌సీఏ సంస్థ వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ కు తాము ఆహ్వానం అందించామని చెప్పింది. అతడే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఈవెంట్‌కు హాజరుకాలేదని హెచ్‌సీఏ తెలిపింది.


ఆస్కార్ కు అడుగు దూరంలో ‘RRR’


‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట అవార్డును అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ పాడారు. ఇప్పటికే ఈ పాటకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆస్కార్ తర్వాత ఆస్కార్ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘నాటు నాటు’ పాటకు దక్కింది. క్రిటిక్ ఛాయిస్ అవార్డును కూడా అందుకుంది.


Read Also: లాస్ ఏంజెల్స్‌కు ‘నాటు నాటు’ ఫీవర్, ఆడియెన్స్ డ్యాన్స్‌తో దద్దరిల్లిన థియేటర్