Holi Celebrations 2023:


వేడుకలపై ఆంక్షలు..


హోళి పండుగ సమీపిస్తున్న తరుణంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తామని, కానీ గీత దాటితే మాత్రం ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. హోళి వేడుకల పేరు చెప్పి అకృత్యాలకు పాల్పడొద్దంటూ హెచ్చరించారు. హోళికోత్సవ్‌తో పాటు షబ్ ఏ బరత్, రంజాన్,నవ్‌రోజ్, చైత్ర నవరాత్రి, రామనవమి తదితర పండుగలను ప్రజంలతా కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ పండుగలు రానున్నాయని, ఈ వేడుకలపై అధికారులు నిఘా పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాలకు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించేలా చూడాలని తేల్చి చెప్పారు. ఆన్‌లైన్ మీటింగ్‌లో వాళ్లందరితోనూ మాట్లాడారు. శాంతి భద్రతల ఉల్లంఘన జరగకుండా చూడాలని తెలిపారు. 


"మరి కొద్ది రోజుల్లో పండుగలు రానున్నాయి. చాలా చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో శాంతి భద్రతలను కాపాడుకోవాలి. మనం కచ్చితంగా నిఘా పెట్టాలి. ఆరేళ్లుగా అన్ని మతాల వారి కార్యక్రమాలు, పండుగలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే తీరు కొనసాగాలి. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ అధికారులు కల్పించాలి. ప్రతి మతాన్ని, ఆచారాన్నీ గౌరవించాలి. కానీ...నియంతృత్వంగా వ్యవహరిస్తామంటే మాత్రం కుదరదు. ఆర్గనైజర్లు అందరూ కచ్చితంగా ప్రశాంతంగా వేడుకలు జరుపుతామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాకే అనుమతులు వస్తాయి"


- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం


ఇదే సమయంలో వేడుకల్లో పెట్టే పాటలపైనా ఆంక్షలు విధించారు యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి వేడుకల్లో పిచ్చిపిచ్చి పాటలు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అసభ్యకరమైన పదాలున్న పాటలు పెట్టొద్దని ఆదేశించారు. అదే సమయంలో స్పీచ్‌ల్లోనూ ఎక్కడా ఏ వర్గాన్నీ కించపరిచే విధంగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వకూడదని వెల్లడించారు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నిర్వాహకులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. 


రికార్డు...


యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం పాటు సీఎంగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు. 5 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి...గత ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ కాలం పాటు ఆ పదవిలో కొనసాగుతున్నారు. 5 సంవత్సరాల 347 రోజులుగా సీఎం కుర్చీలో ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఈ డా. సంపూర్ణానంద్ యూపీకి 5 సంవత్సరాల 345 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. 1954డిసెంబర్ 18 నుంచి 1960 డిసెంబర్ 6వ తేదీ వరకూ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత ఎక్కువ కాలం పాటు ఈ పదవిలో కొనసాగిన  వారిలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 5 సంవత్సరాల 4 రోజుల పాటు కొనసాగారు. తరవాత బీఎస్‌పీ చీఫ్ మాయావతి 4 సంవత్సరాల 307 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. మొత్తం నాలుగు సార్లు ఆమె సీఎం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ 3 సంవత్సరాల 257 రోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యోగి ఆదిత్యనాథ్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీకి రావడానికి కారణమూ ఆయనే.