Mrunal Thakur Meets Harry Potter Star Daniel Radcliffe: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాలో నటించింది. తండ్రి, కూతురు మధ్య సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించారు. బేబీ కియారా ఖన్నా, జయరాం కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను దక్కించుకుంది.  అమెరికాలోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది.


‘హ్యారీ పోర్టర్’ స్టార్ ను కలిసిన మృణాల్


ఈ సినిమా ప్రమోషన్ కోసం ‘హాయ్ నాన్న’ టీమ్ అమెరికాలో పర్యటిస్తోంది. నాని, మృణాల్ తో పాటు ఇతర సభ్యులు అమెరికాలోనే ఉన్నారు. ఇటీవల న్యూయార్క్ వీధుల్లో షికారుకు వెళ్లింది మృణాల్. ఈ సందర్భంగా ఆమెకు ‘హ్యారీ పోటర్’ స్టార్ డేనియల్ రాడ్‌క్లిఫ్‌ ఎదురయ్యారు. అతడిని చూసి ‘సీతారామం’ బ్యూటీ షాక్ అయ్యింది. వెంటనే తనతో సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటోతో పాటు వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో మృణాల్ తో పాటు ఆమె సోదరి లోచన్ ఠాకూర్ కూడా ఉన్నది.  డేనియల్ ముఖానికి తెల్లి మాస్క్ ధరించి ఉన్నాడు. ముగ్గురూ నవ్వుతూ ఈ సెల్పీ తీసుకున్నారు.   


అమెరికాలో ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్


గత కొద్ది రోజులుగా మృణాల్ ఠాకూర్ అమెరికాలో ‘హాయ్ నాన్న’ ప్రమోషన్ లో పాల్గొంటున్నది. హీరో నానితో కలిసి పలు థియేటర్లను సందర్శిస్తున్నది. చిత్రబృందం ప్రేక్షకులను కలిసి మాట్లాడుతున్నది. అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్నది.  తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో కూడా ఫ్యాన్స్ మీట్స్ నిర్వహిస్తున్నారు. అమెరికాలో వసూళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలో ‘హాయ్ నాన్న’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మృణాల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పింది.  “హాయ్ నాన్నా, హాయ్ నాని, హాయ్ న్యూయార్క్. మీ నగరం మా హృదయానికి మరింత దగ్గరయ్యింది. చల్లని శీతాకాలంలో కూడా, నేను మీ వెచ్చదనపు ప్రేమను పొందగలిగాను. మా సినిమాను మీరు ఇష్టపడటం చాలా ఆనందంగా ఉంది. ‘హాయ్ నాన్న’ సినిమాను ఇంతగా ప్రేమించిన మీకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది.     


వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీసెంట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతోంది.


Read Also: అబ్బా, అనిపిస్తోన్న అబ్రార్ ఎంట్రీ సాంగ్, యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘యానిమల్’ - 24 గంటల్లో అన్ని వ్యూసా!