టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తున్నారు. వృత్తిపరంగా క్షణం తీరికలేకుండా ఉన్నా, వీలు చిన్నప్పుడల్లా ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు. ఫారిన్ టూర్లకు వెళ్తూ సరదాగా గడుపుతారు. తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బిగ్ సీ ఈవెంట్ మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రిన్స్ ఫన్నీ సమాధానాలు చెప్పారు.


చిన్నారుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం


ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఆయా కంపెనీలతో పాటు ప్రజలు తనను ఎంతో నమ్ముతున్నారని చెప్పారు. అందుకే తాను ప్రమోట్ చేస్తున్న ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, మహేష్ బాబు ఫౌండేషన్ పలు హాస్పిటల్స్ తో అసోసియేట్ అయినట్లు చెప్పారు. ఆయా హాస్పిటల్స్ ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారుల కోసం మున్ముందుకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటున్నట్లు వెల్లడించారు. రీసెంట్ గా తన కూతురు సితార కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సంతోషంగా ఉందన్నారు.   


స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతా


ఇక అందరిలాగే తనకు కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే అలవాటు ఎక్కువగా ఉందన్నారు. పడుకునే ముందు, నిద్రలేవగానే ఫోన్ చూడటం అలవాటు అయ్యిందన్నారు. ఒక్కోసారి ఫోన్ వాడీ వాడీ తలనొప్పి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే, తాను ఏ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పనన్నాను.


రాజమౌళి సినిమాకు ఈ ఫోటోలతో ఎలాంటి సంబంధం లేదు


గత కొద్ది రోజులుగా తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫిట్ నెస్ ఫోటోల గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు చాలా కాలంగా జిమ్ లో గంటల తరబడి గడపడం అలవాటుగా ఉందన్నారు. ఇప్పుడు కూడా ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫోటోలకు రాజమౌళితో తీయబోయే సినిమాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 


ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతి(2024)కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు భావిస్తున్నారు. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళితో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేయబోతున్నారు.  #SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగుతోంది. ఈ సినిమా ‘ఇండియానా జోన్స్’ త‌ర‌హా అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఉండబోతోందని దర్శకుడు రాజ‌మౌళి ఇప్ప‌టికే వెల్లడించారు. ఇదే విషయాన్ని రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం ధృవీకరించారు.  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Read Also: ఫ్యామిలీ ఫస్ట్ - ఫారిన్ వెకేషన్స్ పై మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial