Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం 'ఆది పురుష్' కు సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం రిలీజైన మూవీ టీజర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో స్పెషల్ ఎఫెక్ట్స్ ను మరింత మెరుగ్గా చేస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని నిలబెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీజర్ లోని ఓ చిన్న క్లిప్ బయటికొచ్చింది. అందులో కాస్త మార్పులు చేసినట్టు తెలుస్తోంది. 'ట్రైబెకా ఫెస్టివల్'లో ప్రదర్శన కోసం రూపొందించిన ప్రోమోలో కనిపించిన ఈ మార్పులు చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది నెటిజన్స్ మాత్రం సెటైర్లు వేస్తూనే ఉన్నారు.


'ట్రైబెకా ఫెస్టివల్'లో 36 దేశాల నుంచి 127 మంది చిత్రనిర్మాతలు, 109 సినిమాలు, చెల్సియా పెరెట్టి, డేవిడ్ డుచోవ్నీ, స్టీవ్ బుస్సేమి, దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయంటూ ఇటీవల ఓ వీడియో విడుదలైంది. చివర్లో 'ఆదిపురుష్' సినిమాలోని ఓ చిన్న క్లిప్ కూడా ఉంది. దీన్ని గమనిస్తే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ కలర్ మినహా పెద్దగా మార్పులేమీ చేయలేదనట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకుముందు రిలీజైన టీజర్ లోని క్లిప్లింగ్ ను పోల్చి చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో మార్పులు చేసిన టీజర్ గానీ, క్లిప్పింగ్స్ గానీ మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా రిలీజ్ చేయలేదు. కనీసం ప్రకటించలేదు కూడా. కానీ తాజా ప్రోమోతో ఆ మార్పులు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.






డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ లు జంటగా నటిస్తోన్న చిత్రం 'ఆది పురుష్'. ఈ సినిమా ముందు నుంచే సవాళ్లను ఎదుర్కొంటోంది. మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన దగ్గర్నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. భారీ సినిమా.. అందులోనూ ప్రభాస్ మూవీ అంటే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అలాంటి సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ గ్లింప్స్, టీజర్ అభిమానులను, నెటిజన్లను తీవ్రంగా నిరాశపరిచింది. రాముడిగా ప్రభాస్ లుక్స్ కూడా ఆశించిన స్థాయి లో గొప్పగా లేవని, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ అసలు సూట్ అవ్వలేదని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 


'ఆది పురుష్' ను ‘మోషన్ కాప్చర్ టెక్నాలజీ’ తో సహజంగా గ్రాఫిక్స్ ఉండేలా చేస్తామని సినీ దర్శకుడు ఓం రౌత్ ఇంతకుముందే ప్రకటించినా.. ఆ మాటను మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించినా.. సినిమా టీజర్ మాత్రం ఏదో కార్టూన్ సినిమా చూస్తున్నట్టే అనిపించిందని చాలా మంది ఆరోపించారు. అంతే కాదు ఈ టెక్నాలజీ కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేశారనే వార్తలూ అప్పట్లో వినిపించాయి. కానీ ఇంత కష్టపడి, ఇంత ఖర్చుపెట్టినా.. నెగిటివ్ టాక్ రావడం మేకర్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ రాముడిలా లేరని, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ అసలు సూట్ అవ్వలేదని, రావణాసురిడి గెటప్‌ను మార్చేశారని విమర్శలు వచ్చాయి. ఇష్టమొచ్చినట్టు తీసి పవిత్రమైన మన రామాయణ గాదని అపహాస్యం చేసే విధంగా డైరెక్టర్ తీశారనే విమర్శలు మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది.


అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ కుదరకపోవడం, ఈ సమయంలోనే మూవీపై వివాదాస్పద కామెంట్లు రావడం 'ఆది పురుష్' రిలీజ్ పై తీవ్రంగా ప్రభావం చూపాయి. బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ఆది పురుష్ ను మొదటగా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్.. సినిమాలోని గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శలను విని, చూసి..  గ్రాఫిక్స్ పనులను మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సినిమా మరింత లేట్ అయింది. దీంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రాన్ని జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.



Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!