జగతి డల్ గా ఉండటం చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్ ఎందుకు రెడీ అవ్వలేదని మహేంద్ర ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ప్రోబ్లం ఉంది మహేంద్ర కానీ నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని మనసులో అనుకుని చెప్పబోతుంటే ఏమైందని దేవయాని వాళ్ళు వస్తారు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావాని అడుగుతుంది. నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదా అంటుంది. అదేమీ లేదు... దేని గురించో బాధ పడుతుందని చెప్తాడు. ఈ ఎంగేజ్మెంట్ ప్రపోజల్ నేను తీసుకొచ్చాను కదా అందుకే ఇష్టం లేదేమోనని శైలేంద్ర అంటాడు. నీకు ఏదైనా పగ ఉంటే నన్ను అను అంతే కానీ నా  కొడుకు ఏం చేశాడు. వసుధారని కూడా తానే రెచ్చగొట్టి ఉంటుందని దేవయాని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.


Also Read: ఇరువురి భామల నడుమ నలిగిపోతున్న మురారీ- ఉంగరం ఎక్కడదని అడిగిన రేవతి


రిషి, వసుధార నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇద్దరూ ముచ్చటగా రెడీ అయి వస్తారు. వాళ్ళని చూసేందుకు జగతికి రెండు కళ్ళు సరిపోవు. అప్పుడే వసుధార వాళ్ళ అమ్మానాన్న కూడా వస్తారు. ఇంటి దగ్గర మీకు ఏవో సమస్యలు ఉన్నాయని వసుధార చెప్పింది ఏమైందని రిషి అడుగుతాడు. అదేమీ లేదని అంటాడు. మరి వసు అలా ఎందుకు చెప్పింది, ఎందుకు ఇప్పుడు నిశ్చితార్ధం ఇష్టం లేదని చెప్పిందని అంటాడు. అందరూ మౌనంగా ఉండేసరికి తర్వాత మాట్లాడుకుందామని రిషి చెప్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత చక్రపాణి ఏదైనా సమస్య ఉందా అని అడుగుతారు. ఏమి లేదని వసు చెప్తే మరి ఎందుకు ఈ క్షణం కోసం ఎదురుచూసిన దానివి అలా చెప్పావని అడుగుతాడు.


ఒకసారి తప్పు చేసి ఇప్పటికీ కుమిలిపోతున్నా మరోసారి అలా జరిగితే భరించలేనని చక్రపాణి కంగారుపడతాడు. మెడికల్ కాలేజ్ పనుల వల్ల అలా అన్నానని కవర్ చేస్తుంది. మీరు ఏ బెంగ పెట్టుకోవద్దని ధైర్యం చెప్తుంది. వసు, రిషి పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుందోనని వసు టెన్షన్ పడుతుంది. శైలేంద్ర కావాలని హడావుడి చేస్తాడు. జంటని చూసి మహేంద్ర చాలా సంతోషంగా ఉంటాడు. జగతి మాత్రం భయపడుతూనే ఉంటుంది. ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమని వాళ్ళు గెలిపించుకున్నారని ఫణీంద్ర వాళ్ళు మాట్లాడుకుంటారు. జగతి డల్ గా ఉండటం చూసి ఏమైంది, వాళ్ళు కలవాలని బలంగా కోరుకుంది నువ్వే మరి అలాంటిది వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు డల్ గా ఉన్నావ్ ఏంటని జగతిని అడుగుతాడు. మహేంద్ర మాట్లాడటం చూసి ఏమైంది పిన్ని ఎందుకు డల్ గా ఉన్నారు, మనసులో దేని గురించో బాధపడుతూ భయపడుతున్నారా అని నటిస్తాడు.


Also Read: ధాన్యలక్ష్మిని కన్నీళ్ళు పెట్టించిన రాజ్- భర్త ఆఫీసు ఎదుటే కావ్యకి అవమానం


అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులని రమ్మని పంతులు పిలుస్తాడు. జగతి వస్తుంటే రిషి దేవయానిని రమ్మని పిలుస్తాడు. మహేంద్ర వాళ్ళు ఆగిపోతారు. ఫణీంద్ర, దేవయాని వాళ్ళు వెళ్లబోతుంటే శైలేంద్ర ఆపుతాడు. పిన్నీ మీరే వెళ్ళండని అంటాడు. నిజంగా నా మీద గౌరవం ఉంటే తన మాట వినమని చెప్తాడు. పద్ధతి ప్రకారం జరగాలని, పిన్నీ బాబాయ్ చేతుల మీదుగానే ఎంగేజ్మెంట్ జరగాలని చెప్తాడు. పిన్నిని అమ్మగా ఒప్పుకోకపోతే బాబాయ్ ని కూడా నాన్నగా ఒప్పుకొనట్టే. కొడుకు నిశ్చితార్థం వాళ్ళ చేతుల మీదగా జరగాలని ఆశ ఉంటుంది కదా ఎందుకు వాళ్ళని బాధపెట్టడమని శైలేంద్ర అంటాడు. రిషి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఒప్పుకుంటాడు. చివరి సారిగా వాడికి అమ్మగా ఉండే అవకాశం ఇస్తున్నానని శైలేంద్ర మెల్లగా జగతితో అంటాడు. ఇరువురి తల్లిదండ్రులు తాంబూలాలు మార్చుకుంటారు. వసు, రిషి ఉంగరాలు మార్చుకుంటారు. రిషి చేతికి వసు వీఆర్ ఉంగరం తొడుగుతుంది.