Guntur Karam Kurchi Madathapetti Song: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబోలో మూడో చిత్రంగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరు కలిసి 'అతడు', 'ఖలేజా' లాంటి చిత్రాలు చేశారు. ‘అతడు’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతమోగించగా, ‘ఖలేజా’ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘గుంటూరు కారం’తో బ్లాక్ బస్టర్ అందుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా, ఏమాత్రం తొందర లేకుండా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు.
'గుంటూరు కారం' నుంచి మరో మాస్ మసాలా సాంగ్
మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2021లో షురూ అయ్యింది. కొన్ని అనివార్య కారణాలతో పలు మార్లు షూటింగ్ కు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమలు కూడా షురూ చేసింది చిత్రబృందం. రీసెంట్ గా ‘గుంటూరు కారం’ నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. వీటిలో ఓ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరోపాట ఫర్వాలేదు అనిపించింది. ఈసారి మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని అదిరిపోయే పాటను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఊరమాస్ సాంగ్ గురించి కీలక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 30న 'కుర్చి మడతపెట్టి' సాంగ్ విడుదల
'గుంటూరు కారం' సినిమా నుంచి 'కుర్చి మడతపెట్టి' అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న పూర్తి పాట విడుదల చేయనున్నట్లు చిత్ర బృదం అధికారికంగా వెల్లడించింది. తాజాగా ప్రోమోలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై ఈ ప్రోమో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ‘కుర్చీ మడతపెట్టి’ అనేది ఒక బూతు మాట. దానితో మహేష్ బాబు పాట ఉంటుందని ఫ్యాన్స్ కూడా అస్సలు ఊహించలేదు. మరి, దీన్ని అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి.
సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' విడుదల
ఇక 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా రాణిస్తున్న మహేష్ సక్సెస్, ఫెయిల్యూర్ తేడా లేకుండా వరుస సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్నారు. ‘గుంటూరు కారం’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.
Read Also: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..