New GST Slabs in India | అమరావతి: దేశంలో పన్ను వ్యవస్థను సులభం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న 4 స్లాబుల (5 శాతం, 12%, 18%, 28%) స్థానంలో ఇకపై కేవలం 2 స్లాబులు 5శాతం, 18 శాతం మాత్రమే అమలులోకి వస్తాయని.. దాంతో ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ట్యాక్స్ తగ్గితే ఉపాధి పెరుగుతుంది..
జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సేవా ఆధారిత రంగాలైన పర్యాటక, సినిమాటోగ్రఫీ రంగాల (Film Industry)పై ప్రభావం పడనుందన్నారు. వీటికి టాక్స్ తగ్గితే ఉపాధి పెరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రత్యేకించి హోటల్ రూమ్ టారిఫ్‌లు రూ.7,500 లోపు ఉన్న వాటిపై పన్ను 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు ఉంటుందన్నారు. ఎకానమీ క్లాస్ విమాన టికెట్లపై GST 12 శాతం నుండి 5% కు తగ్గింపు ఉంటుందని, రెస్టారెంట్ బిల్లులపై పన్ను కూడా 12– 18 శాతం నుండి 5%కి తగ్గుతుందన్నారు. అంతేగాక బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందని కందుల దర్గేష్ అభిప్రాయపడ్డారు.
దిగిరానున్న సినిమా టికెట్ ధరలు
సినిమా రంగం (Tollywood) విషయానికి వస్తే సినిమా టికెట్లు రూ.100 లోపు ఉంటే 12% GST, రూ.100 పైగా ఉంటే 18% GST కొనసాగుతుందన్నారు.. పాత 28% రేటు పూర్తిగా రద్దవుతుందన్నారు. సినిమా ప్రొడక్షన్ సేవలు (editing, dubbing, VFX) అన్నీ 18% శ్లాబ్ పరిధిలోకి లోకి వస్తాయని, ఇది నిర్మాతలకు ఆర్ధికంగా మేలు చేస్తుందన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజలకు చవకైన ప్రయాణం, తక్కువ ధరల్లో వినోదాన్ని పంచుతుందన్నారు. అంతేకాకుండా, పర్యాటక రంగం, సినిమా రంగం బలోపేతం కావడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే సంస్కరణలు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్పులు “సులభ పన్ను – బలమైన ఆర్థిక వ్యవస్థ” లక్ష్యాన్ని చేరుకునే దిశగా పెద్ద అడుగుగా నిలుస్తాయని జనసేన నేత, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.